
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం వార్షిక రుణ ప్రణాళిక రూ.1,61,620 కోట్లుగా నిర్దేశించారు. పోయినేడాది రూ.1,46,238.44 కోట్ల టార్గెట్ పెట్టుకోగా, ఈసారి 10.52 శాతం పెంచి రుణాల లక్ష్యాన్ని నిర్ణయించారు. మొత్తం రుణ ప్రణాళికలో ప్రాధాన్య రంగాలకు 75.93 శాతం ( రూ.1,22,720 కోట్లు) కేటాయింపులు చేశారు. స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్ బీసీ) సమావేశం సోమవారం హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్చార్డీ ఇనిస్టిట్యూట్ లో జరిగింది. ఇందులో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి 2020–21 సంవత్సరానికి గాను వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి రొనాల్డ్ రాస్, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఎస్ఎల్‌బీసీ అధ్యక్షుడు, ఎస్బీఐ సీజీఎం ఓం ప్రకాశ్ మిశ్రా, ఆర్ఐ జనరల్ మేనేజర్ శంకర్ సుందరం, నాబార్డు సీజీఎం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం…
ఈ ఏడాది వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. లోన్ ప్లాన్‌లో ఈ రంగానికి మొత్తంగా రూ.75,141.71 కోట్లు కేటాయించారు. ఇది పోయినేడాది కంటే 9.54 శాతం ఎక్కువ. ఇక ఇందులో పంట రుణాల లక్ష్యం రూ.53,222 కోట్లుగా నిర్ణయించారు. వానాకాలంలో రూ.31,933.20 కోట్లు (60 శాతం), యాసంగిలో రూ.21,288.80 కోట్ల (40 శాతం) మేర రైతులకు రుణాలు మంజూరు చేయాలని టార్గెట్ పెట్టారు. గతేడాది పంట రుణాల లక్ష్యం రూ.48,740 కోట్లు కాగా, ఈసారి 9.20 శాతం పెంచారు. పోయినేడు పంట రుణాల టార్గెట్‌లో 76.13 శాతం మాత్రమే లోన్లు ఇచ్చారు.
వ్యవసాయ అనుబంధ రంగాలకు 21,919 కోట్లు
వ్యవసాయ, అనుబంధ రంగాలకు లాంగ్ టర్మ్ లోన్లు రూ.12,061.07 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు రూ.2,422.37 కోట్లు కేటాయించారు. మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యమిచ్చి, పోయినేడు కంటే16.02 శాతం పెంచారు. వ్యవసాయ, అనుబంధ రంగాల యాక్టివిటీలకు రూ.7,435.76 కోట్లు కేటాయించారు. పంటల ఉత్పత్తి, మార్కెటింగ్ , మౌలిక సదుపాయల కల్పన, నీటి వనరులు, ఉద్యాన, పట్టు పరిశ్రమలు, అటవీ సంపద, భూముల అభివృద్ధితో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల పై దృష్టిసారించారు.
‘ఆత్మ నిర్బర్’ కింద రుణాలు…
కరోనా నేపథ్యంలో ఆత్మ నిర్బర్ భారత్ కింద కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని రంగాలకు రుణాలు మంజూరు చేసినట్లు ఎస్‌ఎల్‌బీసీ తన నివేదికలో వెల్లడించింది. ఎంఎస్ఎంఈలకు రూ.2,513 కోట్లు మంజూరు కాగా.. ఇప్పటికే రూ.1,688 కోట్లు అత్యవసర రుణం కింద అర్హులకు ఇచ్చినట్లు తెలిపింది. అదే విధంగా అర్హులైన 10 శాతం మంది రైతులకు రూ .231 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొంది. రాష్టంలోని 68,190 స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.370 కోట్లు అదనంగా అందజేసినట్లు చెప్పింది. స్ట్రీట్ వెండర్స్ కు కూడా లోన్లు ఇస్తున్నట్లు ఎస్ఎల్ బీసీ వెల్లడించింది.