ముఖ్యమంత్రి కేసిఆర్ ది కర్కాటక రాశి అని, ఈ ఉగాది సంవత్సరంలో ఏప్రిల్ 22 తేదీ నుంచి పర్వాలేదు అన్నట్టుగా ఉంటుందని జ్యోతిష్య పండితులు బాచంపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. ఈ ఏడాదిలో ఆయన ప్రయాణాలు ఎక్కువ చేస్తారని చెప్పారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీ శోభకృత్ నామ ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
బాచంపల్లి సంతోష్ కుమార్ పంచాంగం ప్రకారం.. ఈ ఏడాది ఎలా ఉంటుందంటే..
ఈ ఉగాది సంవత్సరాన్ని రెండు రకాలుగా చెప్పొచ్చు. అందులో ఒకటి శోభన నామ సంవత్సరం లేదా శోభకృత్ నామ సంవత్సరం. ఈ ఉగాది సంవత్సరంలో ప్రపంచ దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధం పెరుగుతుంది. ఈ సంవత్సరం పంటలు బాగా పండుతాయి. మహిళలు అన్ని రంగాల్లో ఆధిపత్యం వహిస్తారు. తెలంగాణలోని కాళేశ్వరం, నాగార్జున సాగర్ తో పాటు అన్ని ప్రాజెక్టుల్లోనూ సమృద్దిగా నీళ్లు ఉంటాయి. తెలంగాణలో ఈ సారి విద్యా రంగంలో మార్పులు వస్తాయి. విద్యా రంగంలో కొన్ని అవకతవకలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రం ఈ సారి అభివృద్దిలో దూసుకుపోతుంది. రాష్ట్రంలో ఈ సారి న్యాయ వ్యవస్థ నుంచి సరైన తీర్పులు వెలువడుతాయి. తెలంగాణలో ప్రతి పక్షాలకు ఈ సారి మనుగడ కష్టమే.
ఈ ఉగాది సంవత్సరంలో ధరలు కొద్దిగా తగ్గుతాయి. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు విపరీతంగా ఉంటాయి. ఈ సారి అక్టోబర్ లో గ్రహణం ఏర్పడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకులు కొంత ఇబ్బంది పడతాయి. ఈ సారి వైరస్ ల ప్రభావం తక్కువ ఉంటుంది. మాస్కులు లేకుండానే ఈ సారి ప్రజలు తిరగవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ ఉగాది సంవత్సరంలో రైతే రాజు అవుతాడు. వర్షాలు సమృద్దిగా ఉంటాయి. పాలల్లో కల్తీ ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఆ రంగం వాళ్ళు జాగ్రత్త ఉండాలి. తెలంగాణకు ఈ ఉగాది సంవత్సరం చాలా మంచి సంవత్సరం.
ఈ సారీ రైతాంగమే ముందంజ..
ఈ సంవత్సరం సైతం రైతాంగం ముందంజలో ఉంటుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. వర్షాలు పుష్కలంగా కురుస్తాయని పంచాంగం తెలిపిందన్న ఆయన.. రాష్ట్రంలో ఎప్పుడూ రైతాంగం సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం రవీంద్రభారతిలో ఉగాది సంవత్సర పంచాంగ శ్రవణం ముగిసింది.
