
అభివృద్ధి చెందిన దేశాల్లో నిరుద్యోగిత తాత్కాలికమైంది. తీవ్రమైంది కాదు. సమష్టి డిమాండ్‌ను పెంచడం వల్ల నిరుద్యోగితను నివారించవచ్చు. కానీ, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నిరుద్యోగిత వ్యవస్థాపూర్వకమైంది. మూలధనం కొరత వల్ల ఏర్పడుతుంది. మూలధనాన్ని పెంచడం ద్వారా దీనిని నివారించవచ్చు. ఇది ఆర్థిక వ్యవస్థకు శాశ్వతమైంది. తీవ్రమైన సమస్య. భారత్‌లో గ్రామాల్లో కాలిక, ప్రచ్ఛన్న నిరుద్యోగిత కనిపిస్తుంది.
కాలిక/ రుతుసంబంధ/ సీజనల్ అన్ఎంప్లాయిమెంట్
వ్యవసాయరంగంలో ఈ నిరుద్యోగిత ఎక్కువగా కనిపిస్తుంది. వ్యవసాయరంగంలో కొన్ని రుతువుల్లో పని లభించి, మరికొన్ని కాలాల్లో(రుతువుల్లో) పని లభించకపోవడాన్ని సీజనల్ అన్ఎంప్లాయిమెంట్ అంటారు. ఉదాహరణకు నైరుతి రుతుపవన కాలంలో విత్తనాలు నాటేటప్పుడు, ఎరువులు వేసేటప్పుడు, పంట మార్పిడి సమయంలో ఆరు నుంచి ఎనిమిది నెలల కాలంలో పని లభిస్తుంది. మిగిలిన కాలంలో పని లభించదు. అదేవిధంగా పంచదార పరిశ్రమలో చెరుకు లభించిన ఆరు నెలల్లో మాత్రమే పని లభిస్తుంది.
ప్రచ్ఛన్న నిరుద్యోగిత
ఏదైనా రంగంలో అవసరమైన వ్యక్తుల కంటే ఎక్కువ మంది వ్యక్తులు పనిచేస్తే వారిని ప్రచ్ఛన్న నిరుద్యోగులు అంటారు. వీరిని పని నుంచి తొలగించినప్పటికీ మొత్తం ఉత్పత్తిలో మార్పు రాదు. అంటే వారి ఉపాంత ఉత్పత్తి సున్నా. ఎవరి ఉపాంత ఉత్పత్తి శూన్యంగా ఉంటుందో వారిని ప్రచ్ఛన్న నిరుద్యోగులుగా భావించవచ్చు. భారత గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ తరహా నిరుద్యోగిత ప్రచ్ఛన్న నిరుద్యోగిత.
వీరికి తాము నిరుద్యోగితలో ఉన్నామనే విషయం తెలియదు. అందుకే దీనిని దాగిఉన్న నిరుద్యోగిత అంటారు. జనాభా పెరగడం, ప్రత్యామ్నాయ ఉపాధి లేకపోవడం వల్ల ఈ నిరుద్యోగిత ఏర్పడుతుంది. భారత వ్యవసాయ రంగంలో, సొంత వ్యాపారం చేసే దుకాణాల్లో ఈ నిరుద్యోగిత ఎక్కువగా కనిపిస్తుంది. ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనే భావనను మొదటగా జోన్ రాబిన్సన్ ప్రవేశపెట్టారు.
ప్రచ్ఛన్న నిరుద్యోగులను నిజ పొదుపుగా ఉపయోగించి మూలధన కల్పనకు దోహదపడేలా చేయవచ్చని రాగ్నార్ నర్క్స్ పేర్కొన్నారు. ప్రచ్ఛన్న నిరుద్యోగులను ఆర్థికాభివృద్ధికి ఉపయోగించుకోవచ్చని జోన్ రాబిన్సన్, ఆర్థర్ లూయిస్, రాగ్నానర్క్స్ అభిప్రాయపడ్డారు. భారత్‌లో ప్రచ్ఛన్న నిరుద్యోగితను శకుంతల మెహ్రా, అమర్త్యసేన్లు అంచనా వేశారు.
విద్యావంతుల్లో నిరుద్యోగిత
రోజురోజుకూ పెరుగుతున్న విద్యావంతుల సంఖ్య కంటే లభించే ఉపాధి అవకాశాలు తక్కువ ఉండటంతో పట్టణాల్లో విద్యలేని వారిలో నిరుద్యోగిత కంటే విద్యావంతుల్లో నిరుద్యోగిత ఎక్కువగా ఉంది.
పారిశ్రామిక నిరుద్యోగిత
గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పెరుగుతున్నాయి. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి కార్యకలాపాలు మందగించినప్పుడు శ్రామికులు ఫ్యాక్టరీల్లో ఉపాధి కోసం తరలిపోతున్నారు. అయితే, పట్టణాల్లో పెరుగుతున్న శ్రామికుల కంటే పారిశ్రామిక రంగంలో కల్పించే ఉపాధి రేటు తక్కువగా ఉండటంతో పారిశ్రామిక నిరుద్యోగిత ఏర్పడుతున్నది. దీనిని పట్టణ నిరుద్యోగిత అని కూడా అంటారు.
సాంకేతిక నిరుద్యోగిత
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందేకొద్ది, సంప్రదాయక సాంకేతిక పరిజ్ఞానంలో పనిచేసేవారు ఉపాధిని కోల్పోతారు. దీనిని సాంకేతిక నిరుద్యోగిత అంటారు. ఉదాహరణకు ఆటో రిక్షా రావడంతో రిక్షాలాగేవారు కంప్యూటర్ రాకతో టైప్ ఇన్స్టిట్యూట్ను నిర్వహించేవారు ఉపాధిని కోల్పోయారు.
అనైచ్ఛిక నిరుద్యోగిత
అమలులోనున్న వేతనం వద్ద పనిచేయడానికి సిద్ధపడినప్పటికి, పని దొరకని పరిస్థితిని అనైచ్ఛిక నిరుద్యోగిత లేదా నిస్వచ్ఛంద నిరుద్యోగిత అంటారు. కీన్స్ దీనికి ప్రాధాన్యత ఇచ్చారు. పెట్టుబడి దేశాల్లో ఈ రకమైన నిరుద్యోగితే ఉంటుంది.
స్వచ్ఛంద నిరుద్యోగిత
అమలులో ఉన్న వేతనం వద్ద పని దొరకినప్పటికి పనికి వెళ్లకపోతే దానిని స్వచ్ఛంద నిరుద్యోగిత అంటారు.
అల్ప ఉద్యోగిత పూర్తి సామర్థ్యం ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే తక్కువ సామర్థ్యం ఉపయోగించే పని చేయడాన్ని అల్ప ఉద్యోగిత అంటారు. ఉపాధి కొరత వల్ల ఒక వ్యక్తి సామర్థ్యానికి తగిన పని దొరకకపోతే అది అల్ప ఉద్యోగిత. ఒక వ్యక్తి తన శక్తి సామర్థ్యాల కంటే (అర్హతల కంటే) తక్కువ సామర్థ్యం లేదా అర్హతలు గల పనిలో పాల్గొంటే అది అల్ప ఉద్యోగిత. ఒక వ్యక్తి తన ఉత్పాదక సామర్థ్యం కంటే తక్కువ ఉత్పత్తిని మాత్రమే దీనిలో ఉత్పత్తి చేయగలడు. శ్రామిక సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవడానికి ఇక్కడ వీలుండదు.