రాబోయే 25 ఏళ్ల అమృత కాలానికి ఈ బడ్జెట్ పునాది

రాబోయే 25 ఏళ్ల అమృత కాలానికి ఈ బడ్జెట్ పునాది

ఈ ఏడాది ప్రవేశపెడుతున్న కేంద్ర బడ్జెట్‌ రానున్న 25 ఏళ్ల అమృతకాలానికి పునాది అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. దేశ జీడీపీ గ్రోత్ రేటు 9.27 శాతంగా అంచనా వేస్తున్నట్లు ఆమె తెలిపారు. తమ ప్రభుత్వం పౌరుల ప్రయోజనాలే లక్ష్యంగా ఎకానమీలో సంస్కరణలు ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. రాబోయే 25 ఏళ్ల (అమృత్ కాల్‌) ప్లాన్‌తో ఈ రిఫార్మ్స్‌ తీసుకొస్తున్నామన్నారు. ప్రస్తుతం మనం 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌గా జరుపుకొంటున్నామని, ఈ ఏడాది బడ్జెట్‌ రాబోయే 25 ఏళ్ల అమృత కాలానికి ఆర్థికాభివృద్ధికి అవసరమైన పునాదిని వేసే బ్లూ ప్రింట్‌గా ఉంటుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. 

భారత్‌ను అగ్రదేశంగా నిలిపేందుకు ప్రణాళికలు

పారదర్శకమైన సమీకృత అభివృద్ధికి ఈ బడ్జెట్‌ నాంది అన్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్‌‌ ద్వారా పేదలకు నేరుగా ఆర్థిక సాయం అభిస్తుందని చెప్పారు. గృహనిర్మాణం, వసతుల కల్పన, తాగునీరు కల్పనలో దేశం వేగంగా ముందుకెళ్తోందని అన్నారు. ఆజాదీ కా అమృతోత్సవ్‌ పరుగు ప్రారంభమైందని, ప్రస్తుతం మనం 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌గా జరుపుకొంటున్నామని, రానున్న 25 ఏళ్లను అమృత కాలంగా 100 ఏళ్ల స్వతంత్ర భారతం వైపు అడుగులు వేయబోతున్నామని నిర్మలమ్మ చెప్పారు. వచ్చే 25 ఏళ్లు భారత్‌ను అగ్రదేశంగా నిలబెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. 

ప్రస్తుతం మనం ఒమిక్రాన్ వేవ్‌ మధ్యలో ఉన్నామని, కొవిడ్‌ కట్టడిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం బాగా కలిసొచ్చిందని నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటంలో టీకా కీలకపాత్ర పోషించిందన్నారు. ఈ అమృతకాల బడ్జెట్‌ యువత, మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీలకు గొప్ప ఊతమివ్వబోతోందని ఆర్థిక మంత్రి చెప్పారు. ఉత్పత్తి ఆధార ప్రోత్సాహకాలు 14 రంగాల్లో మంచి అభివృద్ధి కనిపించిందన్నారు. వచ్చే ఐదేళ్లలో 13 లక్షల కోట్ల ఉత్పాదకతకు తగిన ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. పీఎం గతిశక్తి మాస్టర్‌ ప్లాన్‌.. దేశ ఆర్థిక వ్యవస్థకు నూతన దిశానిర్దేశం చేస్తుందని చెప్పారు.