ఇది జస్ట్​ ట్రైలరే.. టైమొచ్చినప్పుడు మొత్తం సినిమా చూపిస్తం: రాజ్​నాథ్​ సింగ్​

ఇది జస్ట్​ ట్రైలరే.. టైమొచ్చినప్పుడు మొత్తం సినిమా చూపిస్తం: రాజ్​నాథ్​ సింగ్​
  • ఆపరేషన్​ సిందూర్​ పూర్తికాలే 
  • పాకిస్తాన్​ తీరుమారుతుందో లేదోనని పరిశీలిస్తున్నం
  • బ్రహ్మోస్​ శక్తి పాక్​​కు తెలిసొచ్చిందని వ్యాఖ్య
  • భుజ్​ ఎయిర్ ​బేస్​ సందర్శన

అహ్మదాబాద్: పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్​పై చేపట్టిన ఆపరేషన్​ సిందూర్ ఇంకా ముగియలేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ తెలిపారు. ఇప్పటిదాకా జస్ట్​ ట్రైలర్​​ మాత్రమే చూపించామని, టైమొచ్చినప్పుడు మొత్తం సినిమా చూపిస్తామని అన్నారు. శుక్రవారం గుజరాత్​లోని భుజ్​ రుద్రమాత ఎయిర్​ఫోర్స్​ స్టేషన్​ను రాజ్​నాథ్​ సింగ్​ సందర్శించారు. అక్కడి వైమానిక దళ సైనికులతో సమావేశమయ్యారు. ఆయన వెంట ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఉన్నారు. 

ఈ సందర్భంగా రాజ్​నాథ్​ సింగ్​ మాట్లాడుతూ.. ప్రస్తుతం పాకిస్తాన్​చర్యలను పరిశీలిస్తున్నామని, తన తీరు మార్చుకుంటుందా? లేదా? అనేది గమనిస్తున్నామని, ఒకవేళ తేడావస్తే మరింత కఠినంగా ఉంటామని హెచ్చరించారు. దేశంలో శాంతిని నాశనం చేయాలని చూసేవారిపట్ల భారత్​ ఎలా ఉంటుందో ఆపరేషన్​ సిందూర్​తో ప్రపంచానికి తెలిసిందన్నారు. పాకిస్తాన్​ గడ్డపై 9 ఉగ్ర స్థావరాలను మన సైన్యం ధ్వంసం చేయడాన్ని ప్రపంచం మొత్తం చూసిందని చెప్పారు. పాకిస్తాన్​లోని మౌలిక సదుపాయాలకు గణనీయమైన నష్టం వాటిల్లిందని, వారి ఎయిర్​బేస్​లు ధ్వంసమయ్యాయని తెలిపారు.

ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​ సత్తా చాటింది

ఆపరేషన్ సిందూర్‌‌లో భాగంగా ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​సత్తా చాటిందని, మన సాయుధ దళాన్ని ప్రపంచం ప్రశంసిస్తున్నదని ఆయన చెప్పారు. ఎయిర్​ఫోర్స్​ ఎక్కడికైనా వెళ్లగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నదని తెలిపారు. భారత యుద్ధ విమానాలు సరిహద్దు దాటకుండానే పాకిస్తాన్‌‌లోని ప్రతి మూలను ఢీకొట్టగలవని చెప్పారు. దేశ యుద్ధ విధానం, సాంకేతికత మారిందని  ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​ రుజువు చేసిందన్నారు.‘‘మనం కేవలం ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకున్న ఆయుధాలు, ప్లాట్‌‌ఫామ్‌‌లపై మాత్రమే ఆధారపడటం లేదు. మేడ్ ఇన్ ఇండియా పరికరాలు మన సైనిక శక్తిలో భాగమయ్యాయి. 

ఇది న్యూ ఇండియా సందేశాన్ని తెలియజేస్తున్నది. మన దేశంలో తయారుచేస్తున్న ఆయుధాలు అత్యంత సమర్థమైనవి” అని చెప్పారు. మన బ్రహ్మోస్  శక్తిని పాకిస్తాన్ ​స్వయంగా గుర్తించిందని తెలిపారు. ఈ  మేడ్ ఇన్ ఇండియా మిసైల్​ పాకిస్తాన్‌‌కు రాత్రి చీకటిలో చుక్కలు చూపించిందని, ఆకాశ్ క్షిపణి సహా దేశ వాయు రక్షణ వ్యవస్థ అద్భుతమైన పాత్ర పోషించిందని ప్రశంసించారు.

పాక్​కు ఐఎంఎఫ్​ ఫండ్​పై ఆందోళన

ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్) నుంచి వచ్చిన నిధుల్లో ఎక్కువ భాగాన్ని పాకిస్తాన్​ తన దేశంలో ఉగ్రవాద మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేస్తున్నదని రాజ్​నాథ్​ సింగ్​ అన్నారు. అప్పు చేసి మరీ ఆ దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నదని మండిపడ్డారు. ఇటీవల పాకిస్తాన్​కు ఐఎంఎఫ్​ 100 కోట్ల డాలర్ల ఫండ్​ను మంజూరు చేయడంపై ఆందోళన వ్యక్తంచేశారు. 

ఆపరేషన్‌‌ సిందూర్‌‌లో  ధ్వంసమైన ఉగ్రవాద స్థావరాలను పునర్నిర్మించడానికి పాకిస్తాన్​ మళ్లీ ప్రయత్నాలు మొదలెట్టిందని,  జైషే మహ్మద్‌‌ చీఫ్‌‌ మౌలానా మసూద్‌‌ అజార్‌‌కు రూ.14 కోట్ల ఇస్తున్నట్లు ప్రకటించిందని తెలిపారు. పాక్‌‌కు నిధులు మంజూరు చేస్తే పరోక్షంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినట్లే అవుతుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఐఎంఎఫ్‌‌ పాక్‌‌కు నిధులు సమకూర్చడంపై పునరాలోచించాలని కోరారు.