సీఎంతో చర్చించి సమస్యలు పరిష్కరించుకుంటం: థామస్ రెడ్డి

సీఎంతో చర్చించి సమస్యలు పరిష్కరించుకుంటం: థామస్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కారు సూచనతోనే ఆర్టీసీ టీఎంయూలో రెండు వర్గాలు ఒక్కటయ్యాయని ఆ యూనియన్ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి వెల్లడించారు. ఈ ఐక్యతను కొనసాగిస్తూ రాష్ట్రంలోని అన్ని డిపోలకు వెళ్లి కార్మికుల సమస్యలను తెలుసుకుంటామన్నారు. ఇంతకుముందు టీఎంయూలో అశ్వత్థామ రెడ్డి వర్గం జనరల్ సెక్రటరీగా ఉన్న ఏఆర్ రెడ్డి తాజాగా.. థామస్ రెడ్డి వర్గం టీఎంయూ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. గురువారం ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని వీఎస్టీ ఫంక్షన్ హాల్​లో టీఎంయూ (థామస్ రెడ్డి వర్గం) రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలు, గ్రేటర్ హైదరాబాద్ నుంచి డిపో, డివిజనల్, జోనల్, రీజినల్ కమిటీలు, నాన్ ఆపరేషనల్ యూనిట్స్ నుంచి 500 మంది కార్మికులు హాజరయ్యారు. ఈ సమావేశంలో టీఎంయూ రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అనంతరం థామస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..  జోనల్ సెక్రటరీలు, రీజనల్ సెక్రటరీలు, హైదరాబాద్, రంగారెడ్డి, అదిలాబాద్, ఖమ్మం రీజియన్లలో అన్ని డిపో కమిటీలతో పాటు 5 వేల మంది కార్మికులు తమ వర్గంలో చేరినట్లు ప్రకటించారు. మునుగోడు బై పోల్ టైమ్ లో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీ నుంచి వచ్చాక సీఎంను, మంత్రులను కలిసి సమస్యలు పరిష్కరించాలని కోరతామన్నారు. యూనియన్లు లేకపోవటంతో కార్మికులను ఆర్టీసీ మేనేజ్మెంట్ వేధిస్తున్నదని, లీవ్​లు ఇవ్వటం లేదన్నారు. 

అశ్వత్థామరెడ్డి మోసం చేస్తుండు 

టీఎంయూ మరో వర్గం పేరుతో ఆర్టీసీ కార్మికులను జనరల్ సెక్రటరీ అశ్వత్థామరెడ్డి, తిరుపతి మోసం చేస్తున్నారని థామస్ రెడ్డి ఆరోపించారు. యూనియన్ ఆఫీస్ కడతామని చెప్పి యూనియన్ మెంబర్ షిప్ పైసలను  దోచుకున్నారని ఆరోపించారు. తిరుపతికి పదేండ్ల నుంచి యూనియన్ మెంబర్ షిప్ లేదన్నారు. సమ్మె టైమ్ లో చనిపోయిన కార్మికులను పరామర్శించలేదని, ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకోలేదన్నారు. యూనియన్ ఎవరిదన్న అంశంపై కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయని, త్వరలోనే కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. కార్మికులకు పెండింగ్​లో ఉన్న పీఆర్సీలు, పాత పీఆర్సీ బకాయిలను ప్రభుత్వంతో చర్చించి సాధించుకుంటామని ప్రెసిడెంట్ ఏఆర్ రెడ్డి చెప్పారు. కాగా, టీఎంయూ స్టేట్ ప్రెసిడెంట్ గా ఏఆర్ రెడ్డి, జనరల్ సెక్రటరీగా థామస్ రెడ్డి, చీఫ్ అడ్వైజర్లుగా మారయ్య, యాదయ్య, ట్రెజరర్​గా రాఘవరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కమలాకర్ గౌడ్ ను రాష్ట్ర కార్యవర్గం ఎన్నుకుంది. కొత్త కార్యవర్గం వివరాలను లేబర్ కమిషనర్ కు, ఆర్టీసీ ఎండీకి త్వరలో అందజేస్తామని నేతలు చెప్పారు.