ఆ మూడు పార్టీలు ..దేశాన్ని దోచుకుంటున్నయ్ : కేఏ పాల్​

ఆ మూడు పార్టీలు ..దేశాన్ని దోచుకుంటున్నయ్ : కేఏ పాల్​
  • బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తం
  • ధనిక రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్రంగా మార్చారని బీఆర్ఎస్ పై ఫైర్

మెదక్, వెలుగు : బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్  పార్టీలు దేశాన్ని దోచుకోవడానికి పాలన సాగిస్తున్నాయని, ఆ మూడు పార్టీల నుంచి ప్రజలకు విముక్తి కలిగించడమే తమ లక్ష్యమని ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్  కేఏ పాల్  అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రం మెదక్  పట్టణంలో ప్రజా శాంతి పార్టీ జిల్లా ఆఫీసును ఆయన ప్రారంభించారు. అనంతరం  మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో 10 శాతం ఉన్న వెలమలు, రెడ్లు పాలన సాగిస్తూ మిగిలిన 90 శాతం బీసీ, ఎస్సీ,ఎస్టీలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. రైతులకు రైతుబంధు కింద పెట్టుబడి సహాయం చేస్తున్నామని చెప్పి బీఆర్ఎస్  ప్రభుత్వం రూ.వేల కోట్ల అప్పులు చేసి  ధనిక రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్రంగా తయారు చేసిందని విమర్శించారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్  అప్పుల కుప్పగా మార్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ పేరుతో వేల ఎకరాల భూములు గోల్మాల్  చేసిందని ఆరోపించారు.

ఈ మధ్యనే పార్టీ టికెట్ల కోసం రెడ్డి వర్గానికి చెందిన అగ్ర నాయకుడు అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేకు, ఆయన కొడుక్కి టికెట్  ఇచ్చేందుకు  రూ.500 కోట్ల రూపాయలతో  బేరం కుదుర్చుకున్నారని ఆరోపించారు. అలాగే తుక్కుగూడ లో జరిగిన బహిరంగ సభ కోసం కోట్ల రూపాయలు వెచ్చించారని, ఆ డబ్బులు కాంగ్రెస్  పార్టీకి ఎక్కడివని పాల్  ప్రశ్నించారు. రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతమొందించి, అవినీతిరహిత పాలన తెచ్చేందుకు ప్రజా శాంతి పార్టీ వైపు అడుగులు వేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రజా శాంతి పార్టీ గెలిస్తే ప్రజలు గెలుస్తారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 119 స్థానాల్లో ఎంఐఎంకు ఏడు స్థానాలు వదిలి 112 స్థానాలకు తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణ అమరవీరుల ఆశయాలను నెరవేర్చే సత్తా ప్రజాశాంతి పార్టీకి మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు.