పాకిస్థాన్‌పై ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లండి: బీజేపీ ఎమ్మెల్యే

పాకిస్థాన్‌పై ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లండి: బీజేపీ ఎమ్మెల్యే

CAAని వ్యతిరేకించే వాళ్లంతా దేశానికి శత్రువులేనంటూ రాజస్థాన్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాళ్లంతా భారత్ వదిలి వెళ్లిపోవాలని అన్నారు. పాకిస్థాన్‌పై ప్రేమ ఉంటే అక్కడికే పోవాలని చెప్పారు. రాజస్థాన్‌లోని బుందీలో ఆయన నిన్న మీడియాతో మాట్లాడారు.

‘పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశంలో హింసను రెచ్చగొడుతున్న వాళ్లు.. నిరసనల్లో పోలీసులపై దాడి చేసి చంపుతున్నవాళ్లు.. అలా చేస్తున్న వారికి మద్దతుగా నిలుస్తున్న వాళ్లు అందరూ ఈ దేశానికి శత్రువులే. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఎవరైనా సరే దీనికి మినహాయింపు కాదు’ అని అన్నారు మదన్ దిలావర్. ఈ  చట్టం ఎవరి పౌరసత్వాన్ని తొలగించదని, పొరుగు దేశాల్లో మతపరమైన హింసను ఎదుర్కొంటున్న వారికి పౌరసత్వం కల్పిస్తుందని చెప్పారు.

CAA వ్యతిరేకిస్తున్న వాళ్లు భారత్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారని, వారికి ఈ దేశంపై నమ్మకం లేదని అన్నారు దిలావర్. భారత్‌ను ముక్కలు చేయాలని చూస్తున్నారని, వాళ్లకు కాంగ్రెస్ మద్దతు ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ఇటువంటి వాళ్లకు భారత్‌లో బతికే హక్కులేదన్నారు. వాళ్లకు పాకిస్థాన్ లేదా బంగ్లాదేశ్‌లపై అంత ప్రేమ ఉంటే ఆ దేశాలకే వెళ్లిపోవాలన్నారు. ఒక వేళ ఆ దేశాలు వాళ్లను రానివ్వకపోతే హిందూ మహా సముద్రంలో దూకాలని చెప్పారు.