సదువుకున్నోళ్లు రోడ్లపై.. సదువుకోనోళ్లు కేబినెట్​లోనా?

సదువుకున్నోళ్లు రోడ్లపై.. సదువుకోనోళ్లు కేబినెట్​లోనా?

గాంధీ భవన్ వద్ద రోడ్డుపై మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తల ధర్నా 
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బాగా సదువుకున్న వాళ్లు ఉద్యోగాలు లేక రోడ్లపై పడితే.. సరిగ్గా సదువుకోని వాళ్లు మాత్రం మంత్రి వర్గంలో ఉన్నారని మహిళా కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ సునీతా రావు అన్నారు. నిరుద్యోగులకు గొర్లు, బర్లు కాదని ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళలను, నిరుద్యోగులను సీఎం కేసీఆర్, మంత్రులు అవమానిస్తున్నారని మండిపడ్డారు. శనివారం గాంధీభవన్ ముందు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి తట్టా, పార, చీపుర్లు, పనిముట్లు పట్టుకొని నిరసన తెలిపారు. వీరి నిరసనను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సునీతారావు మాట్లాడుతూ.. మహిళలకు ఉపాధి విషయాన్ని సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. నిరుద్యోగులు హమాలీ పని చేసుకోవాలంటూ మంత్రులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కరోనాతో ఉపాధి కోల్పోవడంతో లక్షల మంది రోడ్డున పడ్డారన్నారు. హుజూరాబాద్ ఎన్నికల కోసం దళిత బంధు పథకం తెస్తున్నారని, కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే మహిళా బంధు ఇవ్వాలన్నారు.