
వాళ్లంతా రిటైర్డ్ ఎంప్లాయిస్. వివిధ రంగాల్లో పనిచేసి ఎంతో అనుభవం సాధించినవాళ్లు. రిటైరయ్యాక ఇంటికే పరిమితం అవ్వాలనుకోలేదు. సమాజం కోసం ఏదైనా చేయాలనే ఆలోచనతో చేయిచేయి కలిపారు. అక్షర జ్ఞానంతోనే పదిమందికి మేలు జరుగుతుందనుకున్నారు. అఆలు రానివాళ్ల చేతికి పలక, బలపం ఇచ్చి అక్షరాలు దిద్దిస్తున్నారు. కూరగాయల వ్యాపారులు, వలస కూలీలు, స్లమ్ ఏరియాల్లో ఉండే పిల్లలకు పాఠాలు చెప్తున్నారు. చదవడం, రాయడం నేర్పించి వాళ్లకు కొత్తదారి చూపిస్తున్నారు. ప్రేరణ అనే ఫౌండేషన్ మొదలుపెట్టి రెండేండ్ల నుంచి
ఈ అక్షర జ్ఞాన యాత్ర కొనసాగిస్తున్నారు
వరంగల్ నగరానికి చెందిన పెండ్లి ఉపేందర్ రెడ్డి ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యారు. రెండేండ్ల కిందట కరోనా వల్ల ప్రభుత్వం లాక్ డౌన్ పెట్టినప్పుడు.. స్లమ్ ఏరియాల్లో ఉంటున్న పేద ప్రజల స్థితిగతులు తెలుసుకోవడానికి ముందుకు కదిలారు. అక్కడున్న పరిస్థితులను చూసి వాళ్లకు మాస్కులు పంచారు. వాటిని పంచుతున్నప్పుడు చాలామంది వీధి వ్యాపారులు, వలస కూలీలు, వారి పిల్లలు చదువుకు దూరంగా ఉన్నారని అర్థమైంది. అలాంటివాళ్ల కోసం ఏదైనా చేయాలనే ఆలోచనకు వచ్చారు. అఆలు రాని వాళ్లందరికీ చదువు నేర్పించాలనే నిర్ణయానికి వచ్చారు. అలా అనుకోవడం ఆలస్యం, ‘ప్రేరణ’ అనే ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. మిత్రుడు టీవీ అశోక్‌ను తన పనిలో పార్ట్నర్గా చేసుకున్నారు. అలా ఇద్దరితో మొదలైన ఫౌండేషన్‌లో మరికొందరు రిటైర్డ్ టీచర్స్, ఇతర ఉద్యోగులు కలిశారు.
రోజుకు రెండు గంటల పాఠాలు
వివిధ రంగాల్లో పనిచేసిన వారందరితో కలిసి స్లమ్ ఏరియాలు, కూరగాయల మార్కెట్లు, పలు కాలనీల్లో తిరిగి చదువు రానోళ్లను గుర్తించారు. ఆ తరువాత వాళ్లకి చదువుకోవాలనే ఆసక్తి పెరిగేలా మోటివేషన్ క్లాస్‌లు ఏర్పాటు చేశారు. చదువుకుంటే కలిగే లాభాలు, నాలెడ్జి గురించి వాళ్లకు అర్ధమయ్యేలా చెప్పి పలక, బలపం చేతికిచ్చి అక్షరాలు దిద్దించడం మొదలుపెట్టారు. అందులోనూ కొద్దోగొప్పో అక్షర జ్ఞానం ఉన్నవాళ్లకు టీచర్ బాధ్యతలు అప్పగించి.. మిగతా వాళ్లకు పాఠాలు చెప్పేలా ప్రోత్సహిస్తున్నారు.
ఇలా హనుమకొండలోని అంబేద్కర్ మార్కెట్లో 40 మంది మహిళలు, హంటర్ రోడ్డు చుట్టుపక్కల వలస కూలీల పిల్లలు ఇంకో 40 మంది, వివిధ కాలనీలకు చెందిన మరికొంతమంది మహిళలకు అక్షరాభ్యాసం చేయించారు. ఆ తరువాత రోజుకు రెండు గంటల పాటు క్లాసులు పెట్టి అక్షరాలు నేర్పిస్తున్నారు. ప్రేరణ ఫౌండేషన్ సేవలను గుర్తించిన కొంతమంది యువతీ యువకులు కూడా వాళ్లతో చేతులు కలుపుతున్నారు.
అఆలు రానోళ్లు.. సంతకాలు పెడుతున్నరు
ప్రేరణ ఫౌండేషన్ వాళ్ల కృషి ఫలితంగా చదువుకు దూరమైన ఎంతోమంది ఇప్పుడు ఎంతో మారుతున్నారు. ఇదివరకు బస్సు బోర్డు చదవాలన్నా, సంతకం పెట్టాలన్నా ఇబ్బంది పడిన వాళ్లు సంతకాలు పెట్టే స్థాయికి వచ్చారు. పలక, బలపం, పుస్తకాలు ఇచ్చి చదువు చెప్పడంతో తమ పని అయిపోయింది అనుకోవడం లేదు వీళ్లు. చుట్టుపక్కల పరిస్థితుల గురించి అందరికీ అవగాహన కల్పిస్తున్నారు. ఇతరులతో మాట్లాడే తీరు నేర్పిస్తున్నారు. ఇలా అన్ని విషయాలు చెప్తుండడంతో క్లాసులకు వచ్చేవాళ్లంతా ఎంతో ఇంట్రెస్ట్‌గా క్లాస్‌లు వింటున్నారు. వయసుతో సంబంధం లేకుండా చదువుకునేందుకు ముందుకొస్తున్నారు.
చదువుకుంటేనే బాగుపడతం
అందరూ చదువుకున్నప్పుడు సొసైటీ బాగుపడుతుందనేది నా నమ్మకం. అందుకే ప్రేరణ ఫౌండేషన్ స్టార్ట్ చేసి.. రిటైర్డ్ ఎంప్లాయిస్‌తో కలిసి వీలైనంత ఎక్కువ మందికి అక్షరాలు నేర్పిస్తున్నం. ముందు వారికి చదువు విలువ తెలిసేలా అవగాహన కల్పించాం. రెండేండ్ల నుంచి ఎంతోమంది పిల్లలు, మహిళలకు చదువు చెప్పడం మొదలుపెట్టాం. ఇంకా వీలైనంత మందికి విద్యను చేరువ చేస్తాం.
-పెండ్లి ఉపేందర్ రెడ్డి, అధ్యక్షుడు
మాకూ సంతోషంగా ఉంది
వివిధ పరిస్థితుల వల్ల ఎంతోమంది చదువుకు దూరమవుతారు. అలాంటి వాళ్లకి ముందుగా చదువుకోవాలనే తపన మొదలయ్యేలా అవగాహన కల్పిస్తున్నాం. ఆ తరువాత వాళ్లే రోజూ క్లాస్ లు వింటున్నారు. కనీసం అఆలు కూడా రాని వాళ్లు ఎంతోమంది ఉన్నారు. బలపం పట్టడం తెలియనోళ్లు ఇప్పుడు పుస్తకాలు పట్టి చదవడం చాలా సంతోషంగా అనిపిస్తోంది.
– టీవీ అశోక్ కుమార్, కన్వీనర్
– జునుగరి ప్రశాంత్, హనుమకొండ, వెలుగు
ఫొటోలు: చేతి శ్రీనివాస్