ఊళ్లలో భూములమ్ముకుని..సిటీలో రియల్ ఎస్టేట్

ఊళ్లలో భూములమ్ముకుని..సిటీలో రియల్ ఎస్టేట్

హైదరాబాద్​, వెలుగు: గ్రామాల్లో ఒకప్పుడు భూములను అమ్ముకున్న వారు ఇప్పుడు రియల్​ ఎస్టేట్​ వ్యాపారులుగా మారుతున్నారు. ఉన్న భూమి పోవడం, వేరే వాళ్ల భూములను కౌలుకు తీసుకుందామనుకుంటే వ్యవసాయంపై అవగాహన లేకపోవడం, సొంతూరిలో వేరే పనులు దొరక్క పోగా.. భూముల రేట్లు బాగా పెరగడంతో పట్టణాల్లో ఉంటూ రియల్​ వ్యాపారం చేస్తున్నారు. ఇలా ఒకటి, రెండు ఎకరాల నుంచి 15, 20 ఎకరాలు ఉన్న భూస్వాములు కూడా భూములను అమ్ముకున్నవారు ఉన్నారు. అప్పట్లో ఉన్న భూమి ఇప్పటి వరకు ఉంటే ఎదురులేకపోతుండే అని అనుకుంటున్నారు. ఐదారేళ్ల కిందట ఎకరం ల్యాండ్​ రూ. 2 లక్షల నుంచి 6 లక్షలు ఉన్న భూమి ఇప్పుడు రూ. 30 లక్షల నుంచి కోటి రూపాయల వరకూ పెరిగింది. పట్టణాల్లో ఉంటూ రియల్​ వ్యాపారం చేస్తున్న వారు ముఖ్యంగా హైదరాబాద్​ చుట్టుపక్కల జిల్లాల వారే ఎక్కువగా ఉన్నారు. 

ఈ జిల్లాలకు చెందిన వారు ఎక్కువ

 రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్​, నల్లగొండ జిల్లాలకు చెందిన వారు సిటీలో ఉంటూ అనేక మంది రియల్​ ఎస్టేట్​ వ్యాపారం చేస్తున్నారు. వారు దాదాపు నాలుగైదు వేల మంది ఉంటారని రియల్​ వ్యాపారులు చెబుతున్నారు. గ్రామాల్లో భూములపై అవగాహన ఉంటుండటంతో నగరంలో భూములు కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్​ చూపుతున్న వారిని తీసుకెళ్లి భూములను ఇప్పిస్తున్నారు. అప్పట్లో ఆర్థిక పరిస్థితులు బాగా లేక ఉద్యోగాలు చేసిన వారిలో కొందరు ఉద్యోగాలు మానేసి మరి రియల్​ ఎస్టేట్​ వ్యాపారిన్నే ఫుల్ టైమ్ గా చేస్తున్నారు. 

నాడు లక్షలు, నేడు కోట్లు.. 

ఎనిమిదేళ్ల కిందటి వరకు నగరానికి వంద కిలోమీటర్ల లోపు భూముల రేట్లు పెద్దగా లేవు. ఉమ్మడి మహబూబ్​ నగర్​, మెదక్ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో 50 వేల నుంచి లక్షరూపాయల వరకు ఎకరం మాత్రమే ఉండేది. గ్రామాలకు దగ్గరలో ఉన్న భూములకు 2 నుంచి 3లక్షలు మాత్రమే ఉండేది. కానీ ప్రస్తుతం 20 లక్షలు పెట్టిన కూడా మారుమూల ప్రాంతాల్లో భూములు దొరకని పరిస్థితి ఏర్పడింది. రోజురోజుకు సిటీ విస్తరిస్తుండడంతో భూముల రేట్లు అలాగే పెరుగుతూ వచ్చాయి. అలా సిటీకి 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ప్రస్తుతం భూములు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడో కొనుగోలు చేసి పెట్టుకున్న వారు తిరిగి విక్రయించడంలేదు. వేరే మార్గంలేకపోవడంతో భూములు కొనుగోలు చేసేవారు గ్రామాలవైపు పరుగులు తీశారు. ఇలా సిటీకి 100 కిలోమీటర్లలోపు ఒక్కసారిగా ధరలుపెరిగాయి. ఎనిమిదేళ్ల క్రితం లక్ష రూపాయలు ఉన్న భూమి ధర ఇప్పుడు 40 లక్షలకుపైగానే ఉంది.

రేట్లు పెరగడంతో రియల్ ఎస్టేట్​ చేస్తున్న...​ 

మాది వికారాబాద్​ జిల్లా దోమ మండలం. నాకున్న రెండు ఎకరాలను అప్పట్లో రూ.20 లక్షలకు అమ్మేసిన. ఆ తరువాత కొన్నాళ్లు అక్కడే ఉన్న.  ఏం చేయాలో అర్థం కాక నగరంలోని గుడిమల్కాపూర్ కి వచ్చి మెకానిక్​ పనిచేసిన. ఇప్పుడు మా ఊరు చుట్టుపక్కల భూముల రేట్లు ఒక్కసారిగా పెరగడంతో రియల్ ఎస్టేట్​ వ్యాపారం చేస్తున్న. 
- కృష్ణారెడ్డి, రియల్​ ఎస్టేట్​ వ్యాపారి