ఈ ఎన్నికల్లో మల్లారెడ్డిని ఇంటికి పంపుడు ఖాయం : తోటకూర వజ్రేశ్​యాదవ్

ఈ ఎన్నికల్లో మల్లారెడ్డిని ఇంటికి పంపుడు ఖాయం :  తోటకూర వజ్రేశ్​యాదవ్

శామీర్​పేట, వెలుగు: హామీలను నెరవేర్చని మంత్రి మల్లారెడ్డిని ఈ ఎన్నికల్లో ఇంటికి పంపించాలని మేడ్చల్ సెగ్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేశ్ యాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలంలోని కొల్తూరు, పోతారం, అనంతారం, నారాయణపూర్, జగన్ గూడ, లక్ష్మాపూర్, మూడుచింతలపల్లి, కేశవరం గ్రామాల్లో ఆయన గడప గడపకు తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వజ్రేశ్ యాదవ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో అవినీతి పెరిగిపోయిందన్నారు.

మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మల్లారెడ్డి భూ కబ్జాలకు పాల్పడ్డారని.. మరోసారి అవకాశం ఇస్తే మేడ్చల్ మండలంలోని భూములన్నీ ఆక్రమిస్తాడని ఆయన ఆరోపించారు. అమరుల కుటుంబాలకు  ఒక్క పదవి ఇవ్వని కేసీఆర్.. తన కుటుంబంలోని అందరికీ స్వీట్లు పంచినట్లు పదవులు పంచారని వజ్రేశ్ యాదవ్ మండిపడ్డారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయన వెంట మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, రాష్ట్ర సీనియర్ నేత నక్క ప్రభాకర్ గౌడ్, జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, మూడు చింతలపల్లి మండల కమిటీ అధ్యక్షుడు నర్సింలు యాదవ్, యువజన అధ్యక్షుడు వైద్యనాథ్, వైస్ ఎంపీపీ మంద శ్రీనివాస్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.