
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్ రాష్ర్టాల నుంచి వేలాది మంది తరలివచ్చారు. ఆలయంలో స్వామి వార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కోడె మొక్కులు చెల్లించారు. మహారాష్ట్ర రాష్ట్ర రవాణా కమిషనర్ వివేక్ భీమన్వార్ ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి రాజన్నను దర్శించుకున్నారు. నాగిరెడ్డి మండపంలో వేద పండితులు వారికి ఆశీర్వచనం అందజేశారు. ఆయన వెంట సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ కుమార్ ఉన్నారు.
లడ్డూ తయారీలో నాణ్యత పాటించాలి
భక్తులకు ఇచ్చే లడ్డూ, పులిహోర తయారీలో నాణ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలని రాజన్న ఆలయ ఈఓ రాధాబాయి అన్నారు. మెయిన్ టెంపుల్, ప్రసాద తయారీ విభాగం, ప్రసాద విక్రయ విభాగం, ప్రోటోకాల్ విభాగం, సెంట్రల్ గోదాం, బుకింగ్ కౌంటర్, ప్రచార శాఖ, భక్తుల సమాచార కేంద్రాలను ఆమె పరిశీలించారు. ప్రసాదాల తయారీలో ఉపయోగించే పదార్థాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రసాదం శుద్ధి, ప్రమాణాల పరంగా ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సూచించారు.