నేలవాలిన వరి.. తడిసిముద్దయిన పత్తి
జాలువారుతున్న మిరప.. మురిగిపోతున్న సోయా
వరదలో కొట్టుకపోయిన వడ్లు, మక్కలు
నెట్‌వర్క్, వెలుగు:మొంథా తుఫాన్ రైతులను ముంచేసింది. ఎడతెగని వానతో అనేక జిల్లాల్లో వేలాది ఎకరాల్లో వరి, పత్తి, మక్క, మిరప పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాలతో పాటు కల్లాల్లోని వడ్లు కూడా తడిసిముద్దవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే భారీ వర్షాలు, తెగుళ్లతో దిగుబడి తగ్గిపోయి నష్టాల్లో కూరుకుపోతున్నామని ఆందోళన చెందుతున్న పత్తి రైతులను కూడా తుఫాన్ ఆగం చేసింది. వేల ఎకరాల్లో చేతికొచ్చిన పత్తి పంట రాలిపోయింది. పలుచోట్ల ఆరబోసుకున్న మక్కలు తడిసిపోయాయి.
ముక్కిపోతున్న సోయా..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి, చంద్రుగొండ, జూలూరుపాడు, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి తదితర మండలాల్లో మిర్చి, పత్తి, మక్కతో పాటు వరి పంటలు దెబ్బతిన్నాయి. చేన్లలోకి భారీగా వరద చేరింది. మహబూబాబాద్ జిల్లాలో వాగులు పారడంతో వందల ఎకరాల్లో వరి నీట మునిగింది. ఆరబెట్టిన మక్కలు తడిసి ముద్దయ్యాయి. మహబూబాబాద్, కేసముద్రం మార్కెట్ యార్డ్ కు తెచ్చిన మక్కలు తడిసిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలకు వల్ల పత్తి ఏరేందుకు వీలు లేకుండా పోయింది. పత్తి, సోయా పంటలో తేమ శాతం పెరిగిపోయి నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సోయా కోతలు పూర్తయి నెల రోజులైనా కొనుగోలు చేయకపోవడంతో పంట ముక్కిపోయే ప్రమాదం ఉంది. సిద్దిపేట, హుస్నాబాద్ మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిపోపోయింది. ఆరబోసి వడ్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, కంది, మునిపల్లి, సదాశివపేట, ఝరాసంగం, న్యాల్కల్, రాయికోడ్, కంగ్టీ మండలాల్లో వరి, పత్తి, సోయా పంటలు దెబ్బతిన్నాయి.
నేలవాలిన మిరప తోటలు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రైతులు పత్తి ఏరేందుకు సన్నద్ధమవుతుండగా.. భారీ వర్షాలతో చేన్లలోనే పత్తి తడిసి రంగు మారుతోంది. ఎకరాకు నాలుగు క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈదురు గాలులకు వరి, మిరప తోటలు నేలవాలాయి. భూపాలపల్లి, కాటారం, గణపురం, మహదేవ్ పూర్,చిట్యాల, మొగుళ్లపల్లి, రేగొండ మండలాల పరిధిలో వందలాది ఎకరాల్లో వరి నీట మునగగా.. తోటల్లో నీరు నిలిచి జాలువారి మొక్కలు చనిపోతున్నాయి. జనగామ జిల్లాలో వేలాది ఎకరాల్లో కోతదశలో ఉన్న వరి నేలవాలింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇల్లంతకుంట, తంగళ్లపల్లి, బోయిన్ పల్లి మండలాల్లో వరి పంట దెబ్బతిన్నది. జగిత్యాల జిల్లాలో కొన్ని చోట్ల వడ్లు, మక్కలు తడిసిపోయాయి.
పొలాల్లోకి వరద..
నాగర్‌కర్నూల్‌జిల్లాలో పలు చెరువులు నిండి అలుగుపారాయి. దీంతో చెరువుల కింద ఉన్న పొలాలు నీటమునిగాయి. నాగర్‌కర్నూలు పక్కన ఉన్న కేసరి సముద్రం, నాగనూలు చెరువుల నీళ్లు పొలాల్లో చేరాయి. పెంట్లవెల్లి, తెల్కపల్లి, తాడూరు, ఉప్పునుంతల, బల్మూరు, వంగూరు, కల్వకుర్తి, బిజినేపల్లి తదితర మండలాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలో ముసురువానలతో పత్తి పూర్తిగా తడిసి రాలిపోతోంది. పత్తి నల్లగా మారి మొలకెత్తుతోంది. మరికల్, పల్లెగడ్డ, మాదారం, పెద్దచింతకుంట, పూసల్ పాడు, పస్పుల, జిన్నారం, కన్మనూరు, కౌకుంట్ల, లాల్ కోట, పుట్టపల్లి, అల్లీపురం, చిన్నచింతకుంట, మద్దూరు, నర్వ, ఉందేకోడ్, జంగంరెడ్డిపల్లె, కోమార్ లింగంపల్లి, బెక్కర్ పల్లి, జక్కలపల్లి గ్రామాల్లో దాదాపు 25 వేల ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నది. హన్వాడ, మరికల్, ఎల్లిగండ్ల, జిన్నారం, చిన్నచింతకుంట, వెంకటా పూర్, పనస్పుల, జడ్చర్ల, మిడ్జిల్, మద్దూరు, హన్వాడ, నవాబుపేట, ఇప్పటూరు, కారూరు, మహబూబ్ నగర్, మణికొండ, రామచంద్రా పూర్, ధర్మాపూర్ గ్రామాల్లో కోతకు వచ్చిన వరి పైర్లు నేలకొరిగాయి.
రంగు మారుతున్న పత్తి..
నల్గొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలో కోతలకు సిద్ధంగా ఉన్న వందల ఎకరాల్లోని వరి భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులతో నేలకొరిగింది. తెంపడానికి సిద్ధంగా ఉన్న పత్తి, ఇప్పటికే తెంపిన పత్తి వర్షానికి పూర్తిగా తడిసిపోవడంతో బరువు తగ్గి, రంగు మారడంతో సరైన ధర రాకపోవచ్చునని రైతులు వాపోతున్నారు. యాదాద్రి జిల్లాలో కోత దశకు వచ్చిన వరి చేన్లు నేలవాలాయి. జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో వరి వేయగా 30 శాతం పంట దెబ్బతినే అవకాశం ఉందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఆగకుండా పడిన వానలతో వడ్లు, మక్కలు తడిసి ముద్దయ్యాయి. బీర్కుర్, నస్రుల్లాబాద్, లింగంపేట మండలాల్లో సెంటర్లలో అరబోసిన వడ్లకుప్పలు తడిశాయి. తాడ్వాయి మండలంలోని కాలోజీవాడి, ఎండ్రియాల్, దేవాయిపల్లి, కృష్ణాజివాడిల్లో ఆరబోసిన వడ్లతో పాటు మక్కలు తడిసి ముద్దయ్యాయి.
