వరి, మామిడిపై వడగళ్ల దెబ్బ వేల ఎకరాల్లో  నష్టపోయిన పంటలు

వరి, మామిడిపై వడగళ్ల దెబ్బ వేల ఎకరాల్లో  నష్టపోయిన పంటలు
  • వరి, మామిడిపై వడగళ్ల దెబ్బ
  • వేల ఎకరాల్లో 
  • నష్టపోయిన పంటలు
  • కొనుగోలు కేంద్రాల్లో 
  • తడిసిపోయిన ధాన్యం
  • లబోదిబోమంటున్న రైతులు

సిద్దిపేట రూరల్, కొమురవెల్లి, చేర్యాల, మెదక్​ (శివ్వంపేట, వెల్దుర్తి), హుస్నాబాద్,  వెలుగు: సిద్దిపేట జిల్లా నారాయణరావు పేట, కొమురవెల్లి, చేర్యాల , హుస్నాబాద్, అక్కన్నపేట మండలాలు, మెదక్ జిల్లా రామాయంపేట, వెల్దుర్తి, శివ్వంపేట మండలాల్లో శనివారం వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది.  ఈదురుగాలులు తోడుకావడంతో వరితో పాటు మామిడి తోటలకు భారీ నష్టం వాటిల్లింది. నారాయణరావుపేట మండలంలో రైతులు వరి కోసి ఆరబెట్టుకుంటుండగా రాళ్లవాన పడడంతో వడ్లన్ని తడిసి ముద్దయ్యాయి. పొలాల్లో పైరు నేలకొరగడంతో పాటు వడ్లన్నీ రాలిపోయాయి.  కొమురవెల్లి మండలంలోని అయినాపూర్, కొమురవెల్లి, రాంసాగర్, పోసానిపల్లి, తపాస్పల్లి, గురువన్నపేట గ్రామాల్లో వడగళ్ల వానతో సుమారు 5 వేల ఎకరాలకు పైగా వరి , 200 ఎకరాల్లో మామిడి దెబ్బతిన్నది.  చేర్యాల మండలం నాగపూరి, పెద్దరాజుపేట, పోతిరెడ్డిపల్లి,  చుంచనకోట, వీరన్నపేట గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.  చుంచనకోట చేర్యాల మధ్యన దుర్గమ్మ గుడి, నాగపురి గ్రామాల్లో  భారీ వృక్షాలు నేలకొరిగాయి.  శివ్వంపేట మండలం ఉసిరికపల్లిలో మల్లాగౌడ్‌కు చెందిన ఆరెకరాల వరి పంట దెబ్బతింది.  వెల్దుర్తి  ఈదురు గాలులకు తోటల్లోని మామిడి కాయలు రాలిపోయాయి. హుస్నాబాద్‌  వ్యవసాయ మార్కెట్‌తో పాటు  పొట్లపల్లి, పందిల్ల, గోవర్ధనగిరిలోని కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిచిపోయాయి. అక్కన్నపేట మండలంలోనూ ధాన్యం, మక్కలు నీటిపాలయ్యాయి. ఈ రెండు మండలాల్లో ఏర్పాటుచేసిన 27 సెంటర్లలో వడ్లు తడిసిపోయాయని, ప్రభుత్వం తడిసిన వడ్లను కూడా కొనాలని హుస్నాబాద్​ సొసైటీ చైర్మన్​ బొలిశెట్టి శివయ్య కోరారు. రామాయంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో గొల్పర్తి, కోమటిపల్లి గ్రామాల రైతులు ఆరబోసిన ధాన్యం పూర్తిగా నానిపోయింది.  కొంత మేర  వరద నీటికి  కొట్టుకు పోయింది.  అధికారులు టార్పాలిన్లు ఇవ్వక పోవడంతోనే వడ్లు తడిసి పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.