కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నాలుగోవారానికి భక్తులు భారీగా తరలివచ్చి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. శనివారం అర్ధరాత్రి నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని తలనీలాలు సమర్పించి, మల్లన్న స్వామి పుష్కరిణిలో స్నానాలు ఆచరించారు. పసుపు బియ్యంతో మట్టికుండలలో నైవేద్యం సమర్పించారు. ఆలయ ప్రాంగణం, గంగరేణి చెట్టు, రాజగోపురం, రాతిగీరలు, కోడెల స్తంభం, బస్టాండ్, రాంసాగర్ రోడ్, పెద్దమ్మ ఆలయం, మల్లన్న చెరువు పార్కింగ్ స్థలం తదితర ప్రాంతాలు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి.
క్యూలైన్ల ద్వారా స్వామి దర్శనానికి సుమారు ఐదు గంటల సమయం పట్టింది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈఓ టంకశాల వెంకటేశ్ , ఏఈఓ రావుల సుదర్శన్, సూపరింటెండెంట్ నీళ్ల శేఖర్ సిబ్బంది, ధర్మకర్తలు పర్యవేక్షించగా, హుస్నాబాద్ ఏసీపీ సదానందం ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
