వేలాది మంది బాధిత కుటుంబాలకు రైతు బీమా అందట్లే

వేలాది మంది బాధిత కుటుంబాలకు రైతు బీమా అందట్లే
  • 5,437 కుటుంబాలకు రాష్ట్రవ్యాప్తంగా రూ. 271 కోట్లు పెండింగ్‌‌
  • కాళ్లరిగేలా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న బాధిత కుటుంబాలు
  • సాకులు చూపిస్తూ పరిహారం ఆపేస్తున్న అధికారులు, ఎల్‌‌ఐసీ సీఎం, అగ్రికల్చర్‌‌ మినిస్టర్‌‌
  •  జిల్లాల్లోనూ వందల్లో పెండింగ్‌‌

రైతు బీమా పథకాన్ని 2018 ఆగస్టు 14న ప్రభుత్వం ప్రారంభించింది. 18 నుంచి 60 ఏండ్ల లోపు పట్టాదారులు ఈ పథకానికి అర్హులు. ఏదైనా కారణంతో బీమా పరిధిలోని రైతు చనిపోతే రూ. 5 లక్షల పరిహారం 10 రోజుల్లోపే అందించేలా గైడ్‌‌లైన్స్‌‌ ఇచ్చారు. గతేడాదిలో ఈ పథకం కింద 32.73 లక్షల మంది రైతులకు ప్రభుత్వం ప్రీమియం చెల్లించింది. 2020 ఆగస్టు 15 నుంచి ఇప్పటివరకు 20,816 మంది రైతులు వివిధ కారణాలతో చనిపోయారు. ఇందులో 16,165 క్లెయిమ్స్ సెటిల్ చేయగా 4,651 పెండింగ్‌‌లో ఉన్నాయి. స్కీమ్ మొదలైన 2018లో 226 క్లెయిమ్స్, 2019లో 560 కుటుంబాలకు పరిహారం ఇంకా పెండింగ్‌‌లోనే ఉంది. వీటికి సర్కారు బడ్జెట్ ఇవ్వకపోవడంతోనే పరిహారం రిలీజ్ కాలేదని తెలిసింది. మొత్తం మూడేళ్లలో బీమా పరిధిలో 58 వేల మంది రైతులు చనిపోయారు. 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వేలాది మంది రైతు కుటుంబాలకు రైతు బీమా పరిహారం అందట్లేదు. ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా క్లెయిమ్స్‌‌ సెటిలవట్లేదు. అది లేదు.. ఇది లేదంటూ అటు ఎల్‌‌ఐసీ, ఇటు అధికారులు పరిహారం ఆపేస్తున్నరు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 5,437 క్లెయిమ్స్‌‌ పెండింగ్‌‌లో ఉన్నాయి. సీఎం, అగ్రికల్చర్‌‌ మినిస్టర్‌‌ జిల్లాల్లోనూ వందల్లో ఫైళ్లు ఆగిపోయాయి.    
దరఖాస్తు పెట్టకుండనే పరిహారం ఇస్తమన్నరు
ఏ ఆఫీసుకు పోయే అవసరం లేకుండా, ఎక్కడా దరఖాస్తు పెట్టే పని లేకుండా పరిహారం అందిస్తామని రైతు బీమా స్కీం ప్రారంభించేటప్పుడు సీఎం ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదు. ఇంటి పెద్దను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న కుటుంబ సభ్యులు పరిహారం కోసం అధికారులు, ఎల్‌‌ఐసీ, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా క్లెయిమ్స్ క్లియర్ కావట్లేదు. 

జిల్లా వ్యవసాయాధికారులు, ఎల్‌‌‌‌ఐసీ, బ్యాంకు కారణాలతో పరిహారం లేటవుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. సమస్యలేమైనా ఉంటే ఎల్‌‌‌‌ఐసీ, బ్యాంకు అధికారులతో మాట్లాడి పరిష్కరించాల్సిన సర్కారు కూడా పట్టించుకోవట్లేదని కొందరు అంటున్నారు. గత ఏడాది కాలంలో కరోనాతోనూ రైతులు చనిపోయారు. వాళ్ల కుటుంబాలకు క్లెయిమ్స్‌‌‌‌ ఆగిపోయి అవస్థ పడుతున్నారు.  
ఏదో ఒకటి చెప్పి ఆపేస్తున్నరు
4 నెలల కిందట బీమా పరిధిలో ఉన్న ఓ రైతు చనిపోయాడు. అధికారులకు ఫోన్ చేసి నామినీ దరఖాస్తు, బ్యాంకు వివరాలు తీసుకెళ్లి ఏఈవోకు ఇచ్చారు. పై ఆఫీసర్లకు అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేశానని చెప్పి ఆయన చేతులు దులుపుకున్నాడు. అక్కడి నుంచి ఎల్‌‌‌‌ఐసీకి ఫైల్‌‌‌‌ వెళ్లేందుకు 2 నెలలు టైం తీసుకోగా అక్కడ బ్యాంకు అకౌంట్‌‌‌‌ వంకతో పరిహారం నిలిపేశారు. ఇంకో బ్యాంకులో అకౌంట్ తీసుకుని మళ్లీ మార్చి ఇచ్చినా పరిహారం ఇంకా జమ చేయలేదు. ఇలా ఏదో ఒక కారణంతో పరిహారం ఆపేస్తున్నారు. చాలా వరకు ఆప్లికేషన్లు వ్యవసాయాధికారుల వద్దే పెండింగ్‌‌‌‌లో ఉంటున్నాయి. రైతు బీమాకు ఎంట్రీ చేసే సమయంలో రాని వయసు సమస్య, పరిహారం చెల్లించే టైంలో ఎల్‌‌‌‌ఐసీ ఎత్తి చూపుతోంది. దీనిపై ఉన్నతాధికారులు ఎల్‌‌‌‌ఐసీతో మాట్లాడి పరిష్కరించాల్సి ఉండగా పట్టించుకోవట్లేదు. ఆధార్ మిస్​మ్యాచ్ పేరుతో చాలా క్లెయిమ్స్ పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి. బీమా ప్రీమియం తీసుకుని ఎల్‌‌‌‌ఐసీ ఐడీలు క్రియేట్ చేసి అన్నీ ఓకే చేసుకున్న తరువాత ఆధార్‌‌‌‌లో పేరులో ఒక అక్షరం అటుఇటుగా ఉందని ఆపిన క్లెయిమ్స్ కూడా ఉన్నాయి. బీమా చేసుకున్నాక రైతు ఏ కారణంతో చనిపోయినా పరిహారం ఇవ్వాలి. కానీ బీమా చేసుకున్న రోజు, ఆ తరువాత రోజు, రెండు రోజులకు చనిపోయినా కూడా ఎల్‌‌‌‌ఐసీ పరిహారం ఇస్తలేదు. ఇలా ఎల్‌‌‌‌ఐసీ పరిధిలో 2,920 క్లెయిమ్స్, మిగతావి అధికారుల వద్ద పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి. వీటన్నింటిని ఆ సంస్థతో మాట్లాడి పరిష్కరించే అవకాశం ఉన్నా సర్కారు ఆ పని చేయట్లేదు. 
పెండింగ్‌‌‌‌లలో సంగారెడ్డి టాప్​
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ వందల సంఖ్యలో రైతు బీమా క్లెయిమ్స్ పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 337 ఉండగా ఆ తరువాత గత ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసి ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్‌‌‌‌గా ఉన్న పోచారం శ్రీనివాస్‌‌‌‌రెడ్డి జిల్లా కామారెడ్డిలో 330 కుటుంబాలకు పరిహారం అందలేదు. సీఎం కేసీఆర్ జిల్లా సిద్దిపేటలోనూ 256 కుటుంబాలు రూ.5 లక్షల కోసం ఎదురుచూస్తున్నాయి. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న మంత్రి నిరంజన్ రెడ్డి ఇలాఖా వనపర్తి జిల్లాలో 118 ఆప్లికేషన్లు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి. 

5 నెలలైనా బీమా రాలె
నా భర్త ప్రతాపరెడ్డి ఫిబ్రవరిలో చనిపోయిండు. ఆఫీసర్ దగ్గరికి పోయి అన్ని కాగితాలు ఇచ్చిన. నెల రోజులకు ఆంధ్రాబ్యాంకు అకౌంట్ ఇచ్చారని చెప్పి రిజెక్ట్ చేశారు. వేరే బ్యాంకుకు పొమ్మంటే పోయినం. అక్కడా నెంబర్ పెట్టి అప్లై చేసినం. ఇంత వరకూ పరిహారం రాలె. వస్తదనే చెప్తున్నరు కానీ ఎందుకు ఆగిందో చెప్పట్లే.
- ముడెం సుజాత, మేళ్లచెరువు

ఏడాదిగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నం
మా నాన్న బుచ్చన్న పేరు మీద వ్యవసాయ భూమి ఉంది. గతేడాది ఆనారోగ్యంతో నాన్న మృతి చెందాడు. వ్యవసాయ శాఖ చూట్టు ఏడాదిగా తిరుగుతున్నం. ఇంకా ఐడీ కూడా ఇవ్వలేదు. ఆఫీసర్లను అడిగితే రెండు మూడేళ్లయినోళ్లకే దిక్కులేదనట్లు మాట్లాడుతున్నరు.                           - కొండ అనిల్, జగిత్యాల

ఎందుకాపేసిన్రో కూడా చెప్పట్లే
పోయిన సంవత్సరం రైతుబీమా పరిధిలో ఉన్న మా అమ్మ చనిపోయింది. డెత్, నామినీ సర్టిఫికెట్‌‌‌‌తో పాటు మిగతా డాక్యుమెంట్లన్నీ ఇచ్చినం. మా నాన్నే నామినీగా ఉన్నారు. ఇంతవరకు పరిహారం రాలే. వెబ్‌‌‌‌సైట్ చెక్ చేస్తే రీజన్ తెలుస్తలేదు. అధికారులను అడిగితే తమకేం సంబంధం లేదని, పై నుంచి రావాలని అంటున్నరు. ఎమ్మెల్యే దగ్గరకు పోయినా పరిష్కారం కాలే.                                                                                                                - తిమ్మాపూర్ నితిన్ కుమార్, నిర్మల్​