ఇంజినీరింగ్లో వేలల్లో మిగిలిపోయిన సీట్లు

ఇంజినీరింగ్లో వేలల్లో మిగిలిపోయిన సీట్లు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో ఇంజనీరింగ్​అడ్మిషన్స్​తగ్గినయి. రాష్ట్రవ్యాప్తంగా175 కాలేజీల్లో 79,856 సీట్లు ఉండగా.. 57, 177 మాత్రమే భర్తీ అయ్యాయి. మరో 22,679 సీట్లు మిగిలాయి. ఫైనల్​ఫేజ్​తర్వాత చేపట్టిన స్పెషల్​ రౌండ్ ​కౌన్సెలింగ్​ సీట్ల అలాట్​మెంట్ ​బుధవారంతో పూర్తయింది. ఇంజనీరింగ్​లో 57,177 మందికి, ఫార్మసీలో 223 మందికి సీట్ల అలాట్​మెంట్​ పూర్తయింది. ఇంజనీరింగ్​లో 9 కాలేజీల్లో వందశాతం సీట్లు నిండగా, ఒక కాలేజీలో మాత్రం జీరో అడ్మిషన్లు నమోదయ్యాయి. ఈడబ్ల్యూఎస్ కోటాలో 4,674 మందికి సీట్లు కేటాయించారు. కాగా తక్కువ ఆప్షన్లు ఇచ్చిన 689 మందికి సీట్లు అలాట్ కాలేదు. బుధవారం టెక్నికల్ ఎడ్యుకేషన్​ కమిషనర్ నవీన్ మిట్టల్ వివరాలు రిలీజ్ చేశారు. సీట్లు పొందిన స్టూడెంట్లు ఈనెల 26లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని ఆయన ఆదేశించారు. ఫైనల్​రౌండ్​తో పోలిస్తే, స్పెషల్ రౌండ్ లో అడ్మిషన్లు తగ్గాయి. ఈ నెల12న ఎంసెట్ ఫైనల్ ఫేజ్ సీట్ల అలాట్​మెంట్ జరిగింది. ఇందులో ఇంజనీరింగ్​లో 59,993 మందికి సీట్లు అలాట్ చేయగా, బుధవారం రిలీజ్ చేసిన స్పెషల్ రౌండ్​లో 57,177 మందికి  సీట్లు కేటాయించారు. ఈ లెక్కన 2,816 అడ్మిషన్లు తగ్గాయి. ఫార్మసీ కేటగిరిలో మాత్రం గత అలాట్​మెంట్​లో 221 మందికి సీట్లు కేటాయించగా ఈసారి 223కు పెరిగింది. ఇంజనీరింగ్​లో15 వర్సిటీ కాలేజీల్లో 3,343, రెండు ప్రైవేటు వర్సిటీల్లో 1100, 158 ప్రైవేటు కాలేజీల్లో 52,734 సీట్లు నిండాయి. ఫార్మసీ ఎంపీసీ స్ర్టీమ్​లో మొత్తం 172 కాలేజీల్లో 4,426 సీట్లకు కేవలం 223 సీట్లు మాత్రమే నిండాయి. బీఫార్మసీలో 177, ఫార్మాడీ-లో 46 మందికి సీట్లు అలాటయ్యాయి. 

సీఎస్ఈలోనే ఎక్కువ..
స్పెషల్ రౌండ్​లోనూ  ఇంజనీరింగ్​లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ) కోర్సుదే హవా కొనసాగింది. సీఎస్ఈలో 19,101 సీట్లకు17,596 మంది స్టూడెంట్లకు సీట్లు అలాట్ అయ్యాయి. సీఎస్ఎంలో 6,377, ఐటీలో 4,872, సీఎస్డీలో 3,781 సీట్లు నిండాయి. కంప్యూటర్ సైన్స్​, ఐటీ రిలేటెడ్ కోర్సుల్లో 44,114 సీట్లుంటే 38,146 సీట్లు భర్తీ అయ్యాయి. ఎలక్రానిక్స్ అండ్ ఎలక్ర్టికల్ కేటగిరిలో ఈసీఈలో అడ్మిషన్లకే ఎక్కువ మంది ఆసక్తి చూపారు. ఈసీఈలో 14,210 సీట్లకు10,584 మంది చేరగా, ట్రిపుల్ఈలో 7,142 సీట్లకు 2,991 మందికి చేరారు. సివిల్, మెకానికల్ కేటగిరిలో 12,768 సీట్లకు 4,475 మందికి, ఇతర ఇంజనీరింగ్ కోర్సుల్లో 1,115 సీట్లకు 589 మందికి సీట్లు కేటాయించారు.