లారెన్స్ బిష్ణోయ్ ని రిలీజ్ చేయండి.. లేదంటే మోదీని చంపేస్తాం

లారెన్స్ బిష్ణోయ్ ని రిలీజ్ చేయండి.. లేదంటే మోదీని చంపేస్తాం

ప్రధాని నరేంద్ర మోదీపై దాడి చేస్తామని, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంను పేల్చివేస్తామని వచ్చిన బెదిరింపు మెయిల్ పై ముంబై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేపట్టింది. ప్రోటాన్ మెయిల్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించి ఈ మెయిల్ పంపినట్లు, ఈ ప్లాట్‌ఫారమ్ సర్వర్లు స్విట్జర్లాండ్‌లో ఉన్నాయని గుర్తించినట్లు వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 14న భారత్-పాకిస్థాన్ మధ్య ప్రపంచకప్ మ్యాచ్‌కు నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.

మెయిల్ ప్లాట్‌ఫారమ్‌ను అందించే ఈ స్విట్జర్లాండ్‌కు చెందిన కంపెనీ తన వినియోగదారుల సమాచారాన్ని పంచుకోవడం లేదని, ఈ మెయిల్ ఎక్కడి నుండి వచ్చిందో కనుగొనడం కష్టతరం చేస్తుందని ఒక అధికారి తెలిపారు. ఈ మెయిల్ జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కి రావడంతో.. ఆ తర్వాత తదుపరి విచారణ కోసం ముంబై పోలీసులకు పంపారు. ప్రోటాన్‌ మెయిల్‌ ప్లాట్‌ఫారమ్‌ ద్వారా మెయిల్‌ పంపారని, మెయిల్‌ ఐడీ 'ఒసామా బిన్‌ లాడెన్‌ హైర్‌' పేరుతో రిజిస్టర్‌ అయిందని పోలీసుల విచారణలో తేలింది. ఈ మెయిల్‌కు 7-8 లేయర్‌ల భద్రత ఉందని, దాని డొమైన్ స్విట్జర్లాండ్‌లో ఉందని దర్యాప్తులో తేలిందని పలు వర్గాలు తెలిపాయి. ఈ మెయిల్ ఐడీ గురించి మరింత సమాచారాన్ని పంచుకోవాలని ఏజెన్సీ సంబంధిత ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.

NIAకి వచ్చిన మెయిల్‌లో ఏముందంటే..

"మీ ప్రభుత్వం నుంచి మాకు రూ. 500 కోట్లు, లారెన్స్ బిష్ణోయ్ కావాలి. లేకపోతే రేపు నరేంద్ర మోదీతో పాటు నరేంద్ర మోదీ స్టేడియంను పేల్చేస్తాము. మీరెంత సెక్యూరిటీ పెంచినా సరే. మా నుంచి మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే, ఇ మెయిల్‌ ద్వారానే మాట్లాడండి" అని గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ లో తెలిపారు.