
- 7.5 కిలోల గాంజా స్వాధీనం
సికింద్రాబాద్, వెలుగు: గంజాయి అమ్ముతున్న ముగ్గురిని సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారాసిగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అసిఫాబాద్ జిల్లాకు చెందిన దేవర వంశీ(22) కుటుంబం కొంతకాలం కిందట ఉపాధి కోసం సిటీకి వచ్చి సికింద్రాబాద్ ఏరియాలో ఉంటోంది. వంశీ సెల్ ఫోన్ కవర్లు అమ్మే షాప్ ను నడుపుతున్నాడు. జల్సాలకు బానిసైన అతడు గంజాయికి అలవాటుపడ్డాడు.
ఈజీమనీ కోసం సిటీలో గంజాయి అమ్మడం మొదలుపెట్టాడు. 15 నుంచి 20 మంది కస్టమర్లకు కమీషన్ పద్ధతిలో సరుకును సప్లయ్ చేసేవాడు. గతంలో ఒడిశాలోని రాయ్‌గఢ్‌కు గంజాయి కోసం వెళ్లిన వంశీని అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకు పంపారు. అతడు రాయ్‌గఢ్ సెంట్రల్ జైలులో ఉన్నప్పుడే అంతర్రాష్ట్ర గంజాయి గ్యాంగ్ సభ్యులు మానస్ రంజన్ లాబాలా(26), చందన్ కుమార్ రౌత్(25)తో పరిచయం ఏర్పడింది. హైదరాబాద్‌లో గంజాయికి మంచి డిమాండ్ ఉందని వంశీ వారికి చెప్పాడు. న్యూ ఇయర్ వేడుకలకు ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి సప్లయ్ చేసేందుకు మానస్, చందన్ ఇద్దరూ వంశీతో డీల్ సెట్ చేసుకున్నారు.
ఈ ఏడాది ఆగస్టులో వంశీ జైలు నుంచి రిలీజయ్యాడు. ఆ తర్వాత జైలు నుంచి బయటికి వచ్చిన మానస్, చందన్ ఇద్దరూ దీపక్ అనే మీడియేటర్ ద్వారా రాయగఢ్‌కు చెందిన గంజాయి సప్లయర్ దర్శన్ అలియాస్ జిత్తును కలివారు. అతడి వద్ద కిలో గంజాయి రూ.5 వేల చొప్పున 7.5 కిలోల గంజాయిని కొన్నారు. మానస్, చందన్ రాయ్‌గఢ్ నుంచి గంజాయిని తీసుకుని సిటీకి వచ్చి సికింద్రాబాద్ లో వంశీని కలిశారు. ముగ్గురు కలిసి శనివారం వారాసిగూడ ఏరియాలో గంజాయి అమ్ముతుండగా.. సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్, వారాసిగూడ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల నుంచి రూ. లక్ష విలువైన 7.5 కిలోల గంజాయి, 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని రిమాండ్ కు తరలించారు. పరారీలో ఉన్న మీడియేటర్ దీపక్, సప్లయర్ దర్శన్‌ను అరెస్ట్ చేసేందుకు ఒడిశాలోని రాయ్‌గఢ్ పోలీసులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు.
2.4 కిలోల గంజాయి సీజ్
ఎల్బీనగర్: ఏపీ నుంచి సిటీకి గంజాయిని తీసుకొచ్చి అమ్ముతున్న ముగ్గురిని మహేశ్వరం జోన్ ఎస్ వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్‌సుఖ్‌నగర్‌లోని బాయ్స్ హాస్టల్లో ఉంటున్న నల్గొండ జిల్లాకు చెందిన దండ ఉదయ్ రెడ్డి(21), యాదరి శివశంకర్(21), సిటీలోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీకి బీటెక్ స్టూడెంట్ చల్లపల్లి భార్గవ్(21) గంజాయికి బానిసయ్యారు. ఉదయ్ రెడ్డి శనివారం సిటీకి గంజాయిని తీసుకొచ్చి శివశంకర్, భార్గవ్‌తో కలిసి అమ్ముతుండగా.. మహేశ్వరం ఎస్వోటీ పోలీసులు ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు. 2.4 కిలోల గంజాయికి, 2 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.