సీఎంఆర్ఎఫ్ చెక్కుల స్కాంలో ముగ్గురు అరెస్ట్

సీఎంఆర్ఎఫ్ చెక్కుల స్కాంలో ముగ్గురు అరెస్ట్

సీఎంఆర్ఎఫ్ చెక్కుల స్కాంలో ముగ్గురిని అరెస్ట్ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది నరేశ్, వెంకటేశ్, వంశీని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మెదక్ కి చెందిన బాధితుడు రవి నాయక్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. తన భార్య లలితను పొలం దగ్గర పాము కరవడంతో అమీర్ పేట వెల్ నెస్ హాస్పిటల్ లో చేర్పించాడు రవి నాయక్. ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. 5 లక్షలు బిల్ కావడంతో అప్పటి హెల్త్ మినిస్టర్ హరీశ్ రావు సంతకంతో CMRFకి  అప్లై చేసుకున్నాడు. 

కొన్ని నెలల తర్వాత ఆన్ లైన్ లో చెక్ సాంక్షన్ అయినట్లు చూపించడంతో సెక్రటేరియట్ కి వెళ్లాడు రవినాయక్. అయితే హెల్త్ మినిస్ట్రీ పేషీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ నరేశ్ చెక్ తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నరేశ్ ను నిలదీయడంతో అసెంబ్లీలో అటెండర్ గా పనిచేస్తున్న వెంకటేశ్, డ్రైవర్ వంశీకి చెక్ ఇచ్చినట్లు తెలిపాడు. జూబ్లీహిల్స్ SBI బ్రాంచ్ లో రవి నాయక్ పేరుతో ఉన్న అకౌంట్లో  చెక్ వేసి 87 వేల 500 డ్రా చేశారు నిందితులు. మరికొంతమంది చెక్కులను నిందితులు డ్రా చేసినట్లు తెలుస్తోంది. దీనిపై జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.