
- ఖమ్మం జిల్లాలో సోమవారం వెలుగుచూసిన యువకుడి హత్య కేసులో ముగ్గురు అరెస్ట్
- డబ్బు, బంగారం కోసమే చంపినట్లు నిర్ధారణ
ఖమ్మం రూరల్, వెలుగు : గత నెల 19న కనిపించకుండా పోయి.. సోమవారం ఖమ్మం జిల్లాలో తల, చేతులు మాత్రమే దొరికిన యువకుడి హత్య మిస్టరీ వీడింది. డబ్బులు, బంగారం కోసమే అతడిని హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి గురువారం వెల్లడించారు.
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్యాలకు చెందిన పరిమి అశోక్ ఎం.ఫార్మసీ చదివి ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్నాడు. జీతం ద్వారా వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో వ్యవసాయం మొదలుపెట్టాడు. పలువురి వద్ద అప్పు చేసి వంకాయ తోట సాగు చేయగా నష్టాలు వచ్చాయి. ఈ క్రమంలో ఖమ్మం పట్టణంలోని ఓ హాస్పిటల్‌లో పనిచేస్తున్న కొమ్ము నగ్మ పరిచయం కావడంతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
అలాగే ఖమ్మంలోని లైబ్రరీలో పనిచేస్తున్న కామేపల్లి మండలం కెప్టెన్ బంజరకు చెందిన గట్ల వెంకటేశ్వర్లు అలియాస్ వెంకట్(40)తో అశోక్‌కు పరిచయం ఏర్పడి స్వలింగ సంపర్కానికి దారి తీసింది. తర్వాత వీరిద్దరికీ బాలప్పేటకు చెందిన పెంటి కృష్ణయ్య పరిచయం కావడంతో అందరూ కలిసి తిరిగేవారు. వెంకట్ కాస్త డబ్బున్నవాడిగా కనిపించడంతో అతడిని హత్య చేసి డబ్బు, బంగారం కాజేయాలని అశోక్, నగ్మా, కృష్ణయ్య ప్లాన్ చేశారు. తర్వాత అశోక్.. మనిషిని ఎలా చంపాలి, ముక్కలు ముక్కలుగా ఎలా కట్ చేయాలి ? అని యూట్యూబ్‌లో వీడియోలు చూసి, హత్యకు అవసరమైన కత్తులు కొనుగోలు చేశాడు.
వెంకట్ గత నెల 15న రాత్రి అశోక్ గదికి వచ్చి అక్కడే పడుకున్నాడు. 16వ తేదీ తెల్లవారుజామున వెంకట్ నిద్రిస్తున్న టైంలో నగ్మా ఇంటి బయట కాపలా ఉండగా.. అశోక్ కత్తితో వెంకట్ గొంతుపై పలుమార్లు నరకడంతో తల, మెండెం వేరయ్యాయి. తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా చేసి కవర్లలో కట్టి బైక్‌పై తీసుకెళ్లి కరుణగిరి ప్రాంతంలోని పొదల్లో పడేశాడు. సోమవారం ఖమ్మం జిల్లా దానవాయిగూడెం సమీపంలో యువకుడి తల, మొండెం కనిపించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టారు.
నిందితులను పట్టించిన సెల్‌ఫోన్
వెంకట్‌ను హత్య చేసిన తర్వాత నిందితులు అతడి సెల్‌ఫోన్‌నే వాడుతున్నారు. అందులోనే ఫోన్‌పే యాప్‌ను ఉపయోగించి పలుమార్లు డబ్బులు వాడుకున్నారు. ఈ వివరాలతో పాటు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అశోక్, నగ్మా, కృష్ణయ్యను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పట్టుకున్న సింగరేణి సీఐ తిరుపతిరెడ్డి, కామేపల్లి, కారేపల్లి ఎస్సైలు బి.సాయికుమార్, బి. గోపి, కానిస్టేబుళ్లను ఏసీపీ తిరుపతి రెడ్డి అభినందించారు.