
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాద ఘటనలో హృదయవిదారక దృశ్యాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. బతుకుదెరువు కోసం తమిళనాడుకు పని వెతుక్కుంటూ వెళ్తూ ముగ్గరు సోదరులు కన్నుమూశారు. చరనిఖలి గ్రామానికి చెందిన హరన్ గయెన్(40), నిషికాంత్ గయెన్(35), దిబాకర్ గయెన్(32)లు ఏటా తమిళనాడుకు వచ్చి వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటారు.
ఇటీవలే సొంతూరుకు వచ్చి తిరిగి కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో చెన్నైకి వెళ్తూ రైలు ప్రమాదంలో చనిపోయారు. వారి మరణవార్త తెలియగానే గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలియగానే వారి భార్యలు స్పృహతప్పి పడిపోయారు. హరన్ భార్య అనాజిత మానసిక వ్యాధితో బాధపడుతుందని, ఆమె చికిత్స ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉందని స్థానికులు తెలిపారు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారని వారికి ఇంకా పెళ్లి కాలేదని చెప్తున్నారు.
ఇక నిషికాంత్‌కు ఒక కుమార్తె, కుమారుడుఉన్నారు. ఇద్దరూ మైనర్లే. దిబాకర్‌కు ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు. బాలాసోర్ రైలు ప్రమాదంలో జిల్లాకు చెందిన 12 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. జిల్లాలో మొత్తం 110 మంది గాయపడ్డారని, 44 మంది గల్లంతయ్యారని, 16 మంది తమ ఇళ్లకు తిరిగి వచ్చారని వారు తెలిపారు. కాగా ఇప్పటివరకు ఈ ప్రమాదంలో 288 మంది చనిపోయినట్లుగా రైల్వే అధికారులు వెల్లడించారు.