సెంచరీల మోత... రాహుల్‌‌, జురెల్‌‌, జడేజా వంద, ఇండియా 448/5

సెంచరీల మోత... రాహుల్‌‌, జురెల్‌‌, జడేజా వంద, ఇండియా 448/5
  • తొలి ఇన్నింగ్స్‌‌లో విండీస్ 162 ఆలౌట్‌‌

అహ్మదాబాద్‌‌: తొలి రోజు ఇండియా బౌలర్లు విజృంభించి ప్రత్యర్థిని తక్కువ స్కోరుకు పరిమితం చేస్తే.. రెండో రోజు బ్యాటర్లు దంచికొట్టారు. ధ్రువ్‌‌ జురెల్ (210 బాల్స్‌‌లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 125), రవీంద్ర జడేజా (176 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 104 బ్యాటింగ్‌‌),  కేఎల్‌‌ రాహుల్ (197 బాల్స్‌‌లో 12 ఫోర్లతో 100)  సెంచరీలతో చెలరేగడంతో వెస్టిండీస్‌‌తో తొలి టెస్టును ఇండియా పూర్తిగా తన కంట్రోల్‌‌లోకి తీసుకుంది. కరీబియన్‌‌ బౌలింగ్‌‌ను ఉతికేస్తూ ఒకే రోజు ముగ్గురూ వంద కొట్టడంతో రెండో రోజు, శుక్రవారం ఆట చివరకు తొలి ఇన్నింగ్స్‌‌లో ఇండియా 448/5 భారీ స్కోరుతో నిలిచింది. కెప్టెన్‌‌ శుభ్‌‌మన్ గిల్ (50) కూడా  ఫిఫ్టీలో రాణించగా.. ప్రస్తుతం జడేజాకు తోడు సుందర్ (9 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నాడు. 

అంతకుముందు గురువారం టాస్‌‌ నెగ్గి బ్యాటింగ్‌‌కు దిగిన విండీస్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌లో 44.1 ఓవర్లలో 162  రన్స్‌‌కే కుప్పకూలింది. జస్టిన్ గ్రీవ్స్ (32), షై హోప్ (26), కెప్టెన్ రోస్టన్ చేజ్‌‌ (24) మాత్రమే కాసేపు ప్రతిఘటించారు. ఇండియా బౌలర్లలో సిరాజ్ (4/40), బుమ్రా (3/42), కుల్దీప్ (2/25) విండీస్‌‌ నడ్డి విరిచారు. అనంతరం బ్యాటింగ్‌‌లోనూ దుమ్మురేపిన ఇండియా ప్రస్తుతం 286 రన్స్‌‌ ఆధిక్యంలో ఉంది. మూడో రోజు ఇంకో వంద రన్స్ చేసి ఇన్నింగ్స్‌‌ను డిక్లేర్ చేస్తే మరోసారి బ్యాటింగ్‌‌కు రాకుండానే ఆతిథ్య జట్టు విజయం సాధించే చాన్సుంది.  

దుమ్మురేపి.. దంచికొట్టి సిరాజ్‌‌, బుమ్రా ఖతర్నాక్‌‌ బౌలింగ్‌‌లో కరీబియన్లను తక్కువ స్కోరుకు కట్టడి చేసి తొలి రోజే బ్యాటింగ్‌‌కు వచ్చిన ఇండియాకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (36), రాహుల్‌‌ తొలి వికెట్‌‌కు 68 రన్స్ జోడించారు. వేగంగా ఆడిన జైస్వాల్‌‌.. జేడెన్ బౌలింగ్‌‌లో కీపర్‌‌‌‌కు క్యాచ్ ఇవ్వగా.. సాయి సుదర్శన్ (7) ఫెయిలయ్యాడు. చేజ్‌‌ బౌలింగ్‌‌లో ఎల్బీగా ఔటయ్యాడు. ఆ తర్వాత గిల్‌‌ తోడుగా రాహుల్‌‌ 121/2తో మొదటి రోజును ముగించాడు. శుక్రవారం కూడా ఈ ఇద్దరూ అదే ధాటిని కొనసాగించారు. ఫస్ట్ డేనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్న కేఎల్‌‌ క్లాసిక్ షాట్లతో ఆకట్టుకున్నాడు. 

అయితే, ఫిఫ్టీ పూర్తి చేసుకున్న వెంటనే చేజ్‌‌ బౌలింగ్‌‌లో గ్రీవ్స్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చి గిల్ ఔటవడంతో మూడో వికెట్‌‌కు 98 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్ ముగిసింది.  అప్పటికే క్రీజులో క్రీజులో పాతుకుపోయిన రాహుల్‌‌కు జురెల్ తోడయ్యాడు. జురెల్‌తో కలిసి 200 దాటించిన కేఎల్‌‌  ఈ క్రమంలో స్వదేశంలో 2016 డిసెంబర్‌‌‌‌ తర్వాత మళ్లీ సెంచరీ అందుకున్నాడు.  అయితే, 218/3తో లంచ్‌‌ బ్రేక్‌‌కు వెళ్లొచ్చిన వెంటనే  వారికన్ బౌలింగ్‌‌లో తను వెనుదిరిగాడు. ఆ తర్వాత జత కలిసిన జురెల్, జడేజా విండీస్ బౌలర్లను అద్భుతంగా నిలువరించారు. కెరీర్‌‌‌‌లో ఆరో టెస్టు ఆడుతున్న జురెల్ ఎంతో పరిణతితో బ్యాటింగ్ చేయగా..  జడేజా కౌంటర్-ఎటాక్‌‌తో దూకుడు చూపెట్టాడు. వెస్టిండీస్ బౌలింగ్‌‌లో పదును లేకపోవడం, ఫీల్డింగ్‌‌లో శక్తి కొరవడటం ఇండియా బ్యాటర్ల పని మరింత సులువైంది. 

దాంతో జురెల్‌‌, జడేజా ఫిఫ్టీలు పూర్తి చేసుకోగా.. ఇండియా 326/4తో రెండో సెషన్ ముగించింది. టీ బ్రేక్ తర్వాత కూడా విండీస్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. జడేజాతో పాటు జురెల్‌ స్వేచ్ఛగా షాట్లు కొడుతూ కరీబియన్ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. కొత్త బాల్‌‌ను కూడా వీళ్లు ఈజీగా ఎదుర్కొన్నారు.ఈ క్రమంలో 190 బాల్స్‌‌లో జురెల్‌‌ తన తొలి సెంచరీ అందుకున్నాడు. ఆ తర్వాత స్పీడు పెంచి భారీ షాట్లు కొట్టాడు. కానీ, అరంగేట్రం బౌలర్‌‌‌‌ ఖారీ పియెర్ బౌలింగ్‌‌లో కీపర్‌‌‌‌కు క్యాచ్ ఇవ్వడంతో ఐదో వికెట్‌‌కు 206 రన్స్ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్ ముగిసింది.  ఆ వెంటనే వారికన్ బౌలింగ్‌‌లో సిక్స్ కొట్టిన జడేజా.. అతని ఓవర్లోనే సింగిల్‌‌తో టెస్టుల్లో తన ఆరో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సుందర్‌‌‌‌తో కలిసి డే ముగించాడు. 

టెస్టు కెరీర్‌‌‌‌లో తన తొలి సెంచరీని జురెల్‌‌.. ఇండియన్ ఆర్మీకి అంకితం ఇస్తున్నట్టు ప్రకటించగా.. కేఎల్ రాహుల్ తన చిన్నారి కూతురికి డెడికేట్ చేశాడు.3 ఈ ఏడాది ఒకే ఇన్నింగ్స్‌‌లో మూడు అంతకంటే ఎక్కువ సెంచరీలు నమోదవడం ఇండియాకు ఇది మూడోసారి. ఇంగ్లండ్‌‌ సిరీస్‌‌లో లీడ్స్‌‌, మాంచెస్టర్ టెస్టుల్లో ముగ్గురేసి
బ్యాటర్లు సెంచరీలు కొట్టారు.

సంక్షిప్త స్కోర్లు 

వెస్టిండీస్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌: 44.1 ఓవర్లలో 162 ఆలౌట్  (గ్రేవ్స్ 32, షై హోప్ 26, సిరాజ్ 4/40, బుమ్రా 3/42)
ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌:128 ఓవర్లలో 448/5 (జురెల్ 125, జడేజా 104 బ్యాటింగ్‌‌, రాహుల్ 100, రోస్టన్ చేజ్ 2/90).