
ముగ్గురు చిన్నారుల మృతి.. వీరిలో ఇద్దరు అన్నదమ్ములు
ఆడుకోవడానికని వెళ్లిన ముగ్గురు పిల్లలు నీటి గుంతలో పడి చనిపోయారు. నిజామాబాద్ జిల్లాలోని రెంజల్ మండలం పేపర్‌మిల్లు గ్రామంలో జరిగిందీ ఘటన. గౌతమ్ వాఘ్మారే, పూజ దంపతుల కొడుకులు దీప్ వాఘ్మారే (9), సిద్ధార్థ వాఘ్మారే (8)తో కలిసి జలాలుద్దీన్ అనే వ్యక్తి కుమారుడు హుజురోద్దీన్ (8)లు ఆదివారం మధ్యాహ్నం ఆడుకోవడానికి బయటకు వెళ్లారు. సాయంత్రమవుతున్నా పిల్లలు ఇల్లు చేరకపోవడంతో తల్లిదండ్రులు ఊరంతా వెతికారు. స్నేహితులు, బంధువుల ఇళ్లలో వాకబు చేశారు. ఎక్కడా కనిపించకపోవడంతో ఆదివారం రాత్రి రెంజల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులొచ్చి దర్యాప్తు చేయడంతో.. టైరుతో ఆడుకుంటూ కందకుర్తి వైపు వెళ్లడం చూశామని కొందరు స్థానికులు చెప్పారు. దీంతో అక్కడ వెతికారు.
మహారాష్ట్రలోని ధర్మాబాద్ శివారులోని ఆల్కహాల్ ఫ్యాక్టరీ కోసం మూడేళ్ల క్రితం తవ్విన మొరం గుంత వద్ద సైకిల్ టైరు కనిపించింది. దీంతో పిల్లలు ఆ నీటి గుంతలో పడి ఉంటారని అనుమానించి అందులో గాలించారు. అయితే, అప్పటికే చీకటి పడడంతో గాలింపును ఆపేశారు. సోమవారం ఉదయం మళ్లీ గాలించగా ముగ్గురు పిల్లల మృతదేహాలు బయటపడ్డాయి. పిల్లల మృతదేహాలను చూసిన తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. పోస్ట్‌మార్టం కోసం పిల్లల మృతదేహాలను బోధన్ ప్రభుత్వాస్పత్రికి పోలీసులు పంపించారు. ఊళ్లోని సర్కారు బడిలో దీపక్, సిద్ధార్థలు మూడో తరగతి చదువుతుండగా, హుజురోద్దీన్ రెండో తరగతి స్టూడెంట్. దీపక్, సిద్ధార్థల తల్లిదండ్రులు పొట్టచేత పట్టుకుని పేపర్‌మిల్లు గ్రామానికి వలస వచ్చారు. అక్కడ భవన నిర్మాణ కూలీలుగా పనిచేసుకుంటూ పొట్ట నింపుకుంటున్నారు. కాగా, కొద్ది నెలల క్రితం నిజామాబాద్ శివారులోని నాగారం సమీపంలో అక్రమంగా తవ్విన మొరం నీటి గుంతలో పడి ముగ్గురు స్కూలు విద్యార్థులు చనిపోయారు. ఇలాంటి ఘటనలు అంతకుముందూ ఎన్నో జరిగాయని ప్రజలు అంటున్నారు.