కేటీఆర్ సొంత నియోజకవర్గం..సిరిసిల్లలో బీఆర్​ఎస్​కు షాక్​ 

కేటీఆర్ సొంత నియోజకవర్గం..సిరిసిల్లలో బీఆర్​ఎస్​కు షాక్​ 
  •     ముగ్గురు కౌన్సిలర్లు, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ రాజీనామా 

రాజన్నసిరిసిల్ల,వెలుగు : కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌తోపాటు ముగ్గురు బల్దియా కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. 13వ వార్డు కౌన్సిలర్  నేరేళ్ల శైలజ, 25వ కౌన్సిలర్ కురిక్యాల రవి, 21వ కౌన్సిలర్ వేములవాడ రవి, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ నేరేళ్ల శ్రీకాంత్ గౌడ్ తమ రాజీనామా లెటర్లను పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​

ఎమ్మెల్యే కేటీఆర్, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యకు పంపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేటీఆర్ మంత్రిగా ఉన్నా తమ వార్డుల అభివృద్ధికి ఒక్క పైసా ఇవ్వలేదని, తమను గెలిపించిన ప్రజలకు సమాధానం చెప్పలేకనే పార్టీకి రాజీనామా చేస్తున్నామన్నారు. వీరు త్వరలో కాంగ్రెస్​లో చేరనున్నట్లు సమాచారం. 

జంపింగ్​కు మరో ఐదుగురు రెడీ..

కాగా బీఆర్ఎస్‌‌‌‌ పార్టీకి మరో ఐదుగురు కౌన్సిలర్లు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అధికారం కోల్పోయాక కేటీఆర్‌‌‌‌‌‌‌‌ సొంత నియోజకవర్గంలోనే ఆ పార్టీ లీడర్లు ఇతర పార్టీల్లోకి వలస పోతున్నారు. నెల కింద ముస్తాబాద్ మండలంలోని 8 గ్రామాలు సర్పంచులు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, ఇటీవల ఎల్లారెడ్డిపేట మేజర్ జీపీ తాజా మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్‌‌‌‌రెడ్డి బీఆర్ఎస్‌‌‌‌కు గుడ్‌‌‌‌బై చెప్పారు.

వలసలతో  క్యాడర్‌‌‌‌‌‌‌‌ను కాపాడుకునేందుకు కేటీఆర్ సహా ఇతర ముఖ్య లీడర్లు ఇబ్బందులు పడ్తున్నట్లు తెలుస్తోంది.  ఈ విషయంలో కేటీఆర్ ఆందోళనలో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 

కౌన్సిలర్‌‌‌‌‌‌‌‌కు బుజ్జగింపులు 

రాజీనామా చేసినట్లు ప్రకటించడంతో సాయంత్రం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మాజీ టైక్స్‌‌‌‌టైల్స్‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌లూమ్​ కార్పొరేషన్‌‌‌‌ చైర్మన్ గుడూరి ప్రవీణ్.. కౌన్సిలర్​ నేరేళ్ల శైలజ ఇంటికి వెళ్లి బుజ్జగించారు. అయినప్పటికీ ఆమె పార్టీకి మారేందుకు నిశ్చయించుకున్నట్లు తెలిసింది.