ముగ్గురు సైబర్ నేరస్తుల అరెస్ట్

ముగ్గురు సైబర్ నేరస్తుల అరెస్ట్

వేములవాడ రూరల్, వెలుగు: బ్యాంకు లోన్స్ పేరుతో కాల్స్ చేసి డబ్బులు కొట్టేస్తున్న ముగ్గురు సైబర్​ నేరస్తులను ఆదివారం అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించినట్లు వేములవాడ రూరల్​ సీఐ శ్రీనివాస్​ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్​మండలం ఫాజుల్ నగర్ గ్రామానికి చెందిన  పోగుల మల్లేశం మార్చిలో ఫేస్ బుక్ లో ‘ఇండియా బుల్స్ దని ఫైనాన్స్’ పేరుతో ఉన్న లోన్ యాడ్‌ని చూసి దానిపై క్లిక్ చేశాడు. 

కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్​ చేసి లోన్ ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత ప్రాసెసింగ్‌, ఇన్సురెన్స్‌, ఈఎంఐ, జీఎస్‌టీ, చెక్‌బుక్‌, క్లియరెన్స్‌, సర్వీస్‌ చార్జీల పేరిట పలు దఫాలుగా సుమారుగా రూ.1.18 లక్షలు బాధితుని నుంచి వసూలు చేశారు. లోన్‌ శాంక్షన్‌ కాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు 1930కి కాల్ చేసి కంప్లైంట్ చేశాడు. 

బాధితుని ఫిర్యాదు మేరకు వేములవాడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సైబర్ క్రైమ్ ఎస్సై జునేద్, సిబ్బంది టెక్నికల్‌ ఆధారాలతో మహబూబ్‌నగర్‌‌కు చెందిన నానావత్ అనిల్ నాయక్, బోడ రజిని, బోడ భరత్ రాజ్‌ను ఆదివారం హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు చెప్పారు. వారి దగ్గర నుంచి మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.