మహాలక్ష్మి స్కీమ్.. 11 రోజుల్లో 3 కోట్ల మంది మహిళల జర్నీ

మహాలక్ష్మి స్కీమ్..  11 రోజుల్లో 3 కోట్ల మంది మహిళల జర్నీ

హైదరాబాద్, వెలుగు : ‘మహాలక్ష్మి – -మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ పథకానికి మహిళా ప్రయాణికుల నుంచి ఫుల్​రెస్పాన్స్​ వస్తోందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ స్కీమ్  అమల్లోకి వచ్చిన 11 రోజుల్లోనే రికార్డుస్థాయిలో 3 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో జర్నీ చేశారని ఆయన వెల్లడించారు. ప్రతి రోజూ సగటున 30 లక్షల మంది మహిళలు రాకపోకలు సాగిస్తున్నారని, పురుషులతో కలుపుకుంటే మొత్తంగా నిత్యం 51 లక్షల మంది జర్నీ చేస్తున్నారని చెప్పారు. ప్యాసింజర్లలో  62 శాతం మంది మహిళలే ఉంటున్నారని బుధవారం ఓ ప్రకటనలో ఎండీ వెల్లడించారు.  స్కీమ్ స్టార్ట్ అయిన నాటి నుంచి ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) 88 శాతానికి పెరిగిందని, గతంలో ఇది 69 శాతం మాత్రమే ఉందని ఆయన తెలిపారు. 

ఈ నెల 16వ తేదీన 17 డిపోలు, 17న 20 డిపోలు, 18వ తేదిన 45 డిపోల్లో 100 శాతానికి పైగా ఓఆర్ నమోదైందన్నారు. గత మూడు రోజుల్లో యాదగిరిగుట్ట, వేములవాడ, దుబ్బాక, గజ్వేల్, -ప్రజ్ఞాపూర్, హుజురాబాద్, మేడ్చల్, ముషీరాబాద్, మియాపూర్-2, జీడిమెట్ల, కుషాయిగూడ డిపోలు 100 శాతం ఓఆర్ సాధించాయన్నారు.  ఈనెల 9 నుంచి పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఈ స్కీమ్​ అమలు అవుతోందని సజ్జనార్​ గుర్తుచేశారు. ఈ నెల 15 నుంచి మహిళలకు జీరో టికెట్లు జారీ చేస్తున్నట్టు తెలిపారు. ఈ స్కీమ్ ను  మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. ప్యాసింజర్ల రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ నిర్ణయించిందని ఎండీ చెప్పారు. అందులో భాగంగానే  వచ్చే నాలుగైదు నెలల్లో దాదాపు 2,050 కొత్త బస్సులు అందుబాటులోకి తెచ్చే ప్లాన్ చేస్తున్నామన్నారు. అందులో 1,050 డీజిల్ బస్సులు, 1000 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని, విడతల వారీగా ఆ బస్సులు వినియోగంలోకి వస్తాయని సజ్జనార్ తెలిపారు. 

ఒరిజినల్ గుర్తింపు కార్డులే చూపించాలి

కొందరు మహిళలు గుర్తింపు కార్డులు తీసుకురావడం లేదని.. జిరాక్స్​ కాపీలు తెస్తూ, స్మార్ట్ ఫోన్ లలో ఒరిజినల్​ కాపీలు చూపిస్తున్నారని సంస్థ దృష్టికి వచ్చిందని సజ్జనార్​పేర్కొన్నారు. ఇక నుంచి తప్పనిసరిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఒరిజినల్ ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్​ తదితర గుర్తింపు కార్డులను చూపించి జీరో టికెట్లు తీసుకోవాలని మహిళలకు ఎండీ సూచించారు. జిరాక్స్​ కాపీలు వెంటతెచ్చుకొని, స్మార్ట్ ఫోన్లలో ఒరిజినల్​ కాపీలు చూపిస్తే ఉచిత ప్రయాణానికి అనుమతి ఉండదని ఆయన వెల్లడించారు. 

గుర్తింపు కార్డుల్లో ఫొటో సైతం స్పష్టంగా కనిపించాలన్నారు. జీరో టికెట్ ను జారీ చేస్తేనే ఆ చార్జీని  ఆర్టీసీకి ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుందని స్పష్టం చేశారు.  ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే రూట్ బస్సుల్లో కొందరు ప్రమాదకర రీతిలో ప్రయాణం చేస్తున్నట్లు సంస్థ దృష్టికి వచ్చినట్లు  ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా చివరి ట్రిప్పు బస్సుల్లో ఫుట్ బోర్డు ప్రయాణంతో పాటు బస్సు వెనుక లాడర్ పైన ఎక్కి ప్రయాణిస్తున్నారని, ప్రాణాలను ఫణంగా పెట్టి ఇలా ప్రయాణించడం సరికాదని, రద్దీ సమయాల్లో తమ  సిబ్బందికి సహకరించాలని ప్యాసింజర్లను ఎండీ కోరారు.