హనుమకొండ సిటీ, వెలుగు: వెయ్యేండ్ల చరిత్ర ఉన్న కాకతీయ రాజుల పరిపాలన విశిష్టత, కళావైభవం, ధీరత్వం, దాతృత్వం నేటి తరానికి తెలిపేలా వరంగల్ నగరంలో మూడు రోజుల పాటు కాకతీయ కళల జాతర నిర్వహిస్తున్నట్లు చేతన కళావేదిక వ్యవస్థాపక సభ్యుడు ఆకుల నాగేశ్వర్ తెలిపారు. వరంగల్ ప్రెస్ క్లబ్ లో సోమవారం కాకతీయ కళల జాతర పోస్టర్ రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 13,15,17 తేదీల్లో కాకతీయ కళల జాతర కార్యక్రమం ఉంటుందన్నారు.
మొదటి రోజు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, మంత్రి సీతక్క, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కుడా చైర్మన్ వెంకటరామిరెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ హాజరవుతారన్నారు. రెండో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మూడోరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తదితరులు పాల్గొంటారన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో కార్యక్రమ సహ కార్యనిర్వాహకులు గోకారపు శ్యాం కుమార్, బూరం ప్రశాంత్, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
