
కోయిల్‌కొండ, వెలుగు : చిరుతపులి దాడి చేయడంతో ముగ్గురు గొర్రెల కాపర్లు గాయపడ్డారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండ మండలం కొత్లాబాద్ గ్రామ శివారులో శనివారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన అనుమోని గొల్ల మైబన్న శనివారం సాయంత్రం తన గొర్లను గ్రామ శివారులోని పులిగుట్ట వద్దకు తీసుకెళ్లాడు. రాత్రి ఇంటికి వెళ్లకుండా అక్కడే మందకు కాపలాగా పడుకున్నాడు.
అర్ధరాత్రి గొర్లు అరుస్తుండడంతో నిద్రలేచిన మైబన్న మంద వద్దకు వెళ్లి చూశాడు. అక్కడ అలికిడి అవుతుండడంతో పక్కనే పొలంలో ఉన్న రైతులు సత్యనారాయణరెడ్డి, దుబ్బ చెన్నారెడ్డిని పిలుచుకువచ్చాడు. వారు తమ వెంట తెచ్చుకున్న టార్చిలైట్లతో పరిశీలించగా.. నాలుగు గొర్లు చనిపోయి ఉండగా.. పక్కనే చిరుత కనిపించింది. వారి అలికిడితో లేచిన చిరుత ముగ్గురిపై దాడి చేసింది.
దీంతో చెన్నారెడ్డి తల, గొంతు, మైబన్న చేయి, సత్యనారాయణ కాలికి గాయాలు అయ్యాయి. వారు కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వగా.. గ్రామస్తులతో కలిసి ఘటనాస్థలానికి చేరుకొని ముగ్గురిని మహబూబ్‌నగర్ జిల్లా హాస్పిటల్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ విజయేందిర బోయి ఆదివారం ఉదయం హాస్పిటల్‌కు వెళ్లి బాధితులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.