ఓఆర్ఆర్పై మొక్కలు నాటుతుండగా.. కూలీలపై దూసుకెళ్లిన ట్రక్.. ముగ్గురు మృతి

ఓఆర్ఆర్పై మొక్కలు నాటుతుండగా.. కూలీలపై దూసుకెళ్లిన ట్రక్.. ముగ్గురు మృతి
  • ఓఆర్ఆర్పై మొక్కలు నాటుతుండగా కూలీలపై దూసుకెళ్లిన ట్రక్.. ముగ్గురు మృతి
  • మధ్యాహ్నం పని ముగించుకుని భోజనానికి వెళ్తుండగా ఘటన
  • మృతులంతా ఒడిశా వాసులే
  • కీసర ఔటర్ రింగ్ రోడ్డు​ వద్ద ప్రమాదం

కీసర, వెలుగు: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరలో ఘోర ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై మొక్కలు నాటేందుకు వచ్చిన కూలీలపైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు స్పాట్​లోనే చనిపోయారు. వీళ్లంతా మధ్యాహ్న భోజనం చేయడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని సీఐ ఆంజనేయులు తెలిపారు. ఒడిశాకు చెందిన నారాయణ (22), చెక్ ​మోహన్ (21), జైరామ్ (30) రెండు రోజుల కింద బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వచ్చి శామీర్‌‌‌‌పేటలో నివసిస్తున్నారు. సోమవారం ఇతర కూలీలతో కలిసి రింగ్ రోడ్డుపై మొక్కలు నాటేందుకు వచ్చారు. మధ్యాహ్నం పని ముగించుకొని భోజనం కోసం మిగతా కూలీలతో కలిసి కిందికి వెళ్తున్నారు.

ఈ క్రమంలో అందరికంటే వెనుక ఉన్న ఈ ముగ్గురిని విశాఖపట్నం జిల్లాలోని గాజువాక నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా మేడ్చల్​కు వస్తున్న ట్రక్ ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాలైన ముగ్గురు స్పాట్​లోనే చనిపోయారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రోడ్డు ప్రమాదంపై కుషాయిగూడ ఏసీపీ వెంకట్ రెడ్డి మిగిలిన కూలీలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం కోసం డెడ్​బాడీలను గాంధీ హాస్పిటల్​కు తరలించారు. ట్రక్ డ్రైవర్ గణేష్ నిర్లక్ష్యంగా వాహనం నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.