నాలాలో కొట్టుకుపోయినోళ్ల ఆశలు గల్లంతు..

నాలాలో కొట్టుకుపోయినోళ్ల ఆశలు గల్లంతు..
  • వినోభానగర్, మంగర్​బస్తీ    నాలాల్లో కొట్టుకుపోయిన ముగ్గురు  
  • రెండు రోజులుగా గాలిస్తున్నా ఫలితం లేదు 

వర్ష బీభత్సం.. వరద ప్రవాహంతో నాలాలో పడి కొట్టుకుపోయిన వారు తిరిగివస్తారనే ఆశలు అయినవారిలో గల్లంతవుతున్నాయి. కట్టుకున్నవాడు బతికివస్తాడేమో అని భార్య, కన్నతండ్రి ఏ క్షణమైనా తిరిగి వస్తాడని పసిబిడ్డలు చూస్తున్న ఎదురుచూపులు ఫలించేలా లేవు. మంగారిబస్తీ, వినోభానగర్​లోని నాలాల్లో ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయి ఇప్పటికీ 36 గంటలు గడిచిపోయాయి.

 ప్రతి గంటకీ గల్లంతైన వారి సంబంధీకుల్లో ఎక్కడో మిణుకు మిణుకుమంటున్న నమ్మకం సన్నగిల్లిపోతోంది. తమవారిని తల్చుకుని పెట్టుకుంటున్న కన్నీళ్లు ఇంకి దు:ఖం ఆవిరైపోతోంది. ఏం జరిగి ఉంటుందో అన్న వాస్తవాన్ని అంగీకరించి కనీసం కడచూపైనా దక్కకపోదా అనే ఒకే ఒక్క ఆశతో ఉన్నారు.  

మెహిదీపట్నం/ ముషీరాబాద్, వెలుగు: ఆసిఫ్​నగర్ మంగర్ బస్తీలోని అఫ్జల్ సాగర్ నాలాలో ఆదివారం రాత్రి మామా అల్లుళ్లు కొట్టుకుపోగా, ఇంకా వారి ఆచూకీ దొరకలేదు. ఘటన జరిగిన రోజు నుంచి హైడ్రా, బల్దియా, ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, రెవెన్యూ శాఖ సిబ్బంది, అధికారులు కలిసి మంగర్​బస్తీ నుంచి గోషామహల్​వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఇప్పటివరకు జాడ దొరకలేదు. సోమవారం రాత్రి వరకు ఏకధాటిగా వెతికినా ఫలితం లేకపోవడం, చీకటి పడడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. 

గల్లంతైన అర్జున్, రామ ఇద్దరు మామ, అల్లుళ్లవుతారు. అర్జున్​కు భార్య శకుంతల, ముగ్గురు ఆడపిల్లలున్నారు. నెల కిందటే కొడుకు పుట్టాడు. రామకు కూడా నలుగురు పిల్లలు ఉన్నారు. గల్లంతైన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్​గ్రేషియా ఇవ్వాలని, చిన్నారులకు చదువు చెప్పించడంతో పాటు ఇతర బాధ్యతలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.  

దినేశ్​ ఇంకా దొరకలే..

ముషీరాబాద్​లో ఆదివారం వర్షానికి వినోబా నగర్ నాలాలో కొట్టుకపోయిన దినేశ్​(సన్నీ) ఆచూకీ ఇంకా లభించలేదు. గల్లంతైన చోటనే దినేశ్​భార్య రాజశ్రీ, మూడేండ్ల కొడుకు కార్తీక్ బిక్కు బిక్కు ఏడుస్తూ ఎదురుచూస్తున్నారు. దినేశ్​ పేస్ట్ కంట్రోలర్​గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సోమవారం రాత్రి వినోబా నగర్ నుంచి ప్రేయర్ పవర్ చర్చి, ఆశీర్వాద్ అపార్ట్​మెంట్, అడిక్​మెట్, నాగమయ్యకుంట, పద్మాకాలనీ, బాగ్​లింగంపల్లి, కోరంటి మీదుగా ముసారాంబాగ్​వరకు సుమారు 30 మంది వెతికినా ఆచూకీ లభించలేదు. ప్రేయర్ పవర్ చర్చి సమీపంలో నాలా పైకప్పు తెరిచి చూడగా దినేశ్​టూ వీలర్​కనిపించింది. అక్కడే ఉన్నాడని అనుకుని ఎంత వెతికినా కనిపించలేదు. 

రక్షించండి అని  కేకలు వేశాడు

ఆదివారం రాత్రి భారీ వర్షం కురుస్తుండడంతో దినేశ్​ టూ వీలర్​పై నాలా పక్క నుంచి వెళ్తున్నాడు. వరద ప్రవాహాన్ని అంచనా వేయకపోవడం వల్ల వరద తాకిడికి కింద పడిపోయాడు. నాలాలో స్థానికంగా ఉన్న ఒక పైపును పట్టుకొని రక్షించండి రక్షించండి అని కేకలు వేశాడని స్థానికులు చెప్పారు. తాము తాడు వేసి రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ వరద ప్రవాహం తీవ్రంగా ఉండడంతో కొట్టుకుపోయాడని చెప్పారు.