మీ కోటా క్లోజ్.. మళ్లా ఎట్లడుగుతరు ? మీకిస్తే మా అవసరాలు ఎట్ల తీరాలె: ఏపీని నిలదీసిన తెలంగాణ

మీ కోటా క్లోజ్.. మళ్లా ఎట్లడుగుతరు ? మీకిస్తే మా అవసరాలు ఎట్ల తీరాలె: ఏపీని నిలదీసిన తెలంగాణ
  • త్రీ మెంబెర్ కమిటీ మీటింగ్లో ఏపీని నిలదీసిన తెలంగాణ
  • నీళ్లు తీసుకెళ్తున్నా నష్టాలుంటున్నాయన్న ఏపీ.. నీళ్లు లేకుంటే ఇబ్బందులని వాదన
  • ఏపీకి 10.. తెలంగాణకు 21 టీఎంసీలు కేటాయించిన కృష్ణా బోర్డు

హైదరాబాద్, వెలుగు: కృష్ణా బోర్డు త్రీ మెంబర్ కమిటీ మీటింగ్ వాడివేడిగా జరిగింది. ఏపీ అక్రమంగా కోటాకు మించి వాడుకోవడంపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తాగునీటి అవసరాల కోసం తెలంగాణ, ఏపీ ఇండెంట్ పెట్టిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి మంగళవారం జలసౌధలో బోర్డు త్రీ మెంబర్ కమిటీ మీటింగ్ ను నిర్వహించింది.

ఈ సమావేశానికి తెలంగాణ ఈఎన్సీ రమేశ్ బాబు, ఏపీ ఈఎన్సీ నరసింహ మూర్తి, బోర్డు మెంబర్ సెక్రటరీ సతీశ్ కాంభోజ్, అధికారులు హాజరయ్యారు. ఏపీ తీరును మన అధికారులు గట్టిగానే ఎండగట్టారు. ఇప్పటికే కోటాకు మించి నీళ్లను వాడేసుకున్నారని, మళ్లీ ఎలా అడుగుతారని తెలంగాణ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే 771 టీఎంసీలు వాడేశారని, సాగర్, శ్రీశైలంలో ఉన్న నీళ్లన్నీ తమవేనని తేల్చి చెప్పారు. తమకు కూడా అవసరాలున్నాయని, ఏపీకిస్తే తమ అవసరాలు ఏం కావాలని ప్రశ్నించారు.

అసలే కరువు కాలం ఉంటుందని ఐఎండీ హెచ్చరిస్తున్నదని, ఎల్ నినో వస్తే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని తెలంగాణ అధికారులు పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణకే నష్టం జరుగుతుందని, ఏపీ నీళ్లు తీసుకెళ్లి స్టోర్ చేసుకుని వాడేసుకుంటుందని చెప్పారు. కానీ ఇబ్బందులు తమకే వస్తాయన్నారు. కనుక నీళ్లను పొదుపుగా వాడుకోవాల్సింది పోయి.. మళ్లీ నీళ్లు కావాలంటే ఎలా అని నిలదీశారు. అయితే, తాగునీటి అవసరాలకే అడుగుతున్నామని ఏపీ అధికారులు బదులిచ్చారు. తాము తీసుకెళ్తున్న జలాల్లోనూ ఆవిరి నష్టాలతో పాటు ఇతర నష్టాలుంటున్నాయని చెప్పారు. డ్రింకింగ్ కోసమే వాడుకుంటామని, నీళ్లు ఇవ్వకుంటే ఎండాకాలంలో ఇబ్బందులు వస్తాయని, నీళ్లు విడుదల చెయ్యాలని ఏపీ అధికారులు కోరారు.

కేవలం తాగు అవసరాలకే..
రెండు రాష్ట్రాల అభిప్రాయాల అనంతరం.. నీటి వాడకానికి బోర్డు ఓకే చెప్పింది. ఏపీ కోరినట్టుగా సాగర్ ప్రాజెక్టు నుంచి 10 టీఎంసీలు కేటాయించింది. ఇటు తెలంగాణకు 3 టీఎంసీలు ఎక్కువిచ్చింది. సాగర్ నుంచి 13 టీఎంసీలు, శ్రీశైలం నుంచి 5 టీఎంసీలు కలిపి 18 టీఎంసీలు అడగ్గా.. 21 టీఎంసీలు కేటాయించింది. సాగర్ నుంచి 16, శ్రీశైలం నుంచి 5 టీఎంసీలు తీసుకోవాలని సూచించింది. ఆగస్ట్ వరకు తాగు నీటి అవసరాలు తీర్చుకోవాలని సూచించింది. డ్రింకింగ్ పర్పస్ కే వాడుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ సాగుకు మళ్లించొద్దని తేల్చి చెప్పింది.