నల్గొండ, వెలుగు: దేశంలోకి శరణార్థులుగా వచ్చి చోరీలు చేస్తున్న ముఠాలోని ముగ్గురిని నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద రూ. 60 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. నల్గొండ అడిషనల్ ఎస్పీ జి.రమేశ్ సోమవారం కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.
మయన్మార్ దేశం నుంచి హమీద్ హుస్సేన్, జహంగీర్ ఆలం, షఫిక్ ఆలం, మహమ్మద్ ఇస్లాం, కమల్ హుస్సేన్, ఖైసర్, నూర్ ఖాసిం శరణార్థులుగా భారత్‌కు వచ్చి హైదరాబాద్‌లోని బాలాపూర్, రాయల్ కాలనీలో నివసిస్తున్నారు. వీరు జల్సాలకు అలవాటు పడి కంపెనీలను టార్గెట్ గా చేసుకుని చోరీలు చేస్తున్నారు. ఈనెల 7న నల్గొండ టౌన్ పరిధి ఆర్జాలబావి శివారులో నిధి పైపుల కంపెనీలో చోరీ చేశారు.
సొత్తును ఆటోలో తీసుకెళ్లలేక పక్కనే చెట్ల పొదల్లో దాచిపెట్టి, తిరిగి బాలాపూర్ వెళ్లిపోయారు. మళ్లీ సోమవారం తెల్లవారుజామున వచ్చి సొత్తును హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఆ సమయంలో బుద్దారం రోడ్, చర్లపల్లి శివారులో నల్గొండ టూ టౌన్ సీఐ రాఘవరావు, ఎస్ఐ సైదాబాబు వాహనాల తనిఖీ చేస్తుండగా నిందితులు పట్టుబడ్డారు. పోలీసులు అదుపులోకి తీసుకుని నిందితుల వద్ద 40 ఇత్తడి సైజర్లు, 35 బ్యాటరీలు, యూపీఎస్ బంచ్ కేబుల్ వైర్, 50 కేజీల ట్రాన్స్ ఫార్మర్ కాపర్ వైర్, ప్యాసింజర్ ఆటోను స్వాధీనం చేసుకున్నారు.
రికవరీ సొత్తు విలువ రూ.60 లక్షలు ఉంటుంది. దొంగల ముఠాలోని ముగ్గురు హమీద్ హుస్సేన్, జహంగీర్ ఆలం, షఫిక్ ఆలంను పట్టుకోగా, మరో నలుగురు మహమ్మద్ ఇస్లాం, కమల్ హుస్సేన్, ఖైసర్, నూర్ ఖాసిం పరారీలో ఉన్నారు. నల్గొండ రూరల్ పోలీస్ సిబ్బందిని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.
