
- జూబ్లీహిల్స్ లో ఫైట్ స్టార్ట్... మూడు పార్టీల నుంచి క్యాండిడేట్లు ఫైనల్
- నామినేషన్ వేసిన బీఆర్ఎస్ అభ్యర్థి సునీత
- ప్రచారంలో కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్
- గెలుపు కోసం బస్తీల్లో పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రులు
- బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి ఫైనల్
- బీసీలకు ఇవ్వలేదంటూ రాజాసింగ్ విమర్శలు
హైదరాబాద్: మూడు పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులెవరో తేలిపోయింది. ఇవాళ బీజేపీ అభ్యర్థిని ఆ పార్టీ జాతీయ నాయకత్వం ప్రకటించింది. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసి మూడోస్థానానికి పరిమితమైన లంకల దీపక్ రెడ్డి పేరును ఖరారు చేసింది. ఆయన 2023 ఎన్నికల్లో 25,866 ఓట్లు సాధించారు.
గత ఎన్నికల్లో ఇక్కడ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా, కాంగ్రెస్ క్యాండిడేట్ గా అజారుద్దీన్ బరిలో నిలిచారు. గోపీనాథ్ కు 80,549 ఓట్లు రాగా, కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన అజారుద్దీన్ కు 64,212ఓట్లు లభించాయి. ఎంఐఎం తరఫున పోటీ చేసిన రషీద్ ఫరాజుద్దీన్ కు 7,848 ఓట్లు వచ్చాయి.
ఈ సెగ్మెంట్ పరిధిలోని ముస్లిం ఓట్లు గణనీయంగా ఉండటంతో మజ్లిస్ నిర్ణయాత్మక శక్తిగా ఉంటుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ ను అభ్యర్థిగా బరిలోకి దింపడంతో ముస్లిం ఓట్లు అజారుద్దీన్ కు మళ్లాయి. దీంతో పాటు బీఆర్ఎస్ కూడా ఓటును షేర్ చేసుకుందనే విశ్లేషణలున్నాయి. ఈ క్రమంలో మాగంటి గోపీనాథ్ 16,337 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
బరిలో వీరే
ఈ సారి మూడు ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులెవరనేది తేలిపోయింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున గోపీనాథ్ సతీమణి సునీత రంగంలోకి దిగింది. ఆమె ఇప్పటికే ప్రచారంలో తలమునకలయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 2018లో ఎంఐఎం అభ్యర్థిగా బరిలోకి దిగి భారీగా ఓట్లు పొందిన నవీన్ యాదవ్ పోటీలో ఉన్నారు. అదే విధంగా 2023 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డికి బీజేపీ టికెట్ ఖరారు చేసింది. ఈ సారి మజ్లిస్ పోటీకి దూరంగా ఉంటోందని సమాచారం. దీంతో ఇక్కడ మైనార్టీల ఓట్లే కీలకంగా మారనున్నాయి. ఆ ఓట్లు ఎవరికి వస్తే వారు విజయం సాధించే అవకాశం ఉంటుంది.
బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న మాగంటి సునీత సానుభూతితో పాటు తన భర్త గోపీనాథ్ చేసిన అభివృద్ధిపై ప్రధానంగా ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్థానికుడు కావడంతోపాటు అధికార పార్టీ తరఫున పోటీచేస్తుండటం కలిసొచ్చే అంశమనే విశ్లేషణలున్నాయి. లంకల దీపక్ రెడ్డి కూడా గత ఎన్నికల్లో ఓడిపోయిన సింపథీతోపాటు హిందూ ఓటు బ్యాంకును ప్రధానగా నమ్ముకున్నారని సమాచారం.