
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: బిర్యాని తిని ముగ్గురు అస్వస్థతకు గురవగా.. వీరిలో ఒకరికి సీరియస్ గా ఉన్న ఘటన భద్రాద్రి జిల్లా కొత్తగూడెం టౌన్ లో జరిగింది. బాధితులు రెస్టారెంట్వద్ద ఆందోళనకు దిగారు. ఇందుకు సంబంధించిన వివరాలను బాధితులు బుధవారం మీడియాకు తెలిపారు. పాల్వంచకు చెందిన షానవాజ్, గణేశ్, రోహిత్ కొత్తగూడెం టౌన్ లోని రైస్గ్రాండ్ రెస్టారెంట్ లో మంగళవారం వెళ్లారు. వీరు బిర్యాని తింటుండగా.. మాంసం వాసన రావడంతో రెస్టారెంట్సిబ్బందిని నిలదీశారు. తప్పైందని, బిల్లు కట్టాల్సిన అవసరం లేదంటూ యువకులకు సర్ది చెప్పేందుకు యత్నించారు. అయినా.. వినకుండా యువకులు బిల్లు కట్టి రశీదు తీసుకుని వెళ్లారు.
కొద్దిసేపటికి వాంతులు చేసుకోగా.. కొత్తగూడెంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. టెస్టులు చేసిన డాక్టర్లు ఫుడ్ పాయిజన్అయిందని తేల్చారు. వెంటనే యువకులు ఫుడ్ ఇన్ స్పెక్టర్ కు కంప్లయింట్ చేశారు. షానవాజ్ కు సీరియస్ గా ఉండడంతో బుధవారం రెస్టారెంట్ వద్దకు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు. “ మమ్ముల్ని ఎవరూ ఏమి చేయలేరు. మీరు ఎవరికి చెప్పుకుంటారో, చెప్పుకోండి” అంటూ రెస్టారెంట్యాజమాన్యం బెదిరించిందని బాధితులు వాపోయారు. గతంలోనూ రెస్టారెంట్ లో పలుమార్లు పాడైన మాంసం పెడ్తున్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. వెంటనే అధికారులు స్పందించి రెస్టారెంట్‌ను సీజ్చేయాలంటూ బాధితులతో పాటు స్థానికులు డిమాండ్చేస్తున్నారు.