నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా అత్యంత వేగంతో ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.పెద్దవూర మండలం ముత్యాలమ్మగూడెం స్టేజి సమీపంలో ఈ విషాదం చోటుచేసుకుంది. జూన్ 18న అర్ధరాత్రి సుమారు 10 గంటల సమయంలో... వేగంగా వస్తున్న స్విఫ్ట్, మారుతి ఎక్స్‌ప్రెస్ కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు కార్ల ముందు భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా... మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
మృతుల్లో ఇద్దరిని తండ్రీకొడుకులుగా గుర్తించారు. వారు కాకర్ల తంసయ్య, ప్రకాశ్‌రావుగా పోలీసులు నిర్ధారించారు. మరో మృతుడిని సాయికుమార్‌గా గుర్తించారు. సాయికుమార్ ఎస్ఎల్బీసీ (SLBC) ప్రాజెక్టులో సైట్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పెద్దవూర పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సాగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పెద్దవూర పోలీసులు... ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.
