తొలిరోజే దారుణం.. మ‌ద్యం మ‌త్తులో ఘ‌ర్ష‌ణ, ఒక‌రు మృతి

తొలిరోజే దారుణం.. మ‌ద్యం మ‌త్తులో ఘ‌ర్ష‌ణ, ఒక‌రు మృతి

కరోనా వైరస్ కారణంగా గత 45 రోజులుగా మూసి ఉన్న మద్యం దుకాణాలు రాష్ట్రంలో బుధవారం తెరుచుకున్నాయి. ఉదయం నుంచే మందుప్రియులు క్యూ కట్టారు. కొన్ని చోట్ల తోపులాటలు కూడా జరిగాయి. ఇదిలా ఉంటే మద్యం మత్తులో ముగ్గురు వ్య‌క్తులు ఘర్షణ పడి అందులో ఒక‌రు మృతి చెందిన ఘ‌ట‌న వ‌రంగ‌ల్ లో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. నెల్లూరు నుంచి వచ్చిన 10 మంది వలస కూలీలు భవనం నిర్మాణంలో మేస్త్రీలుగా పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లూ పనులు లేక దాతలు ఇచ్చే ఆహారంపైనే జీవనం గడిపారు. బుధ‌వారం తెలంగాణ ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరవడంతో.. వారిలో ముగ్గురు వ్య‌క్తులు చేతిలో ఉన్న డబ్బును పోగుచేసుకుని… గంటల తలబడి క్యూలో నిలబడి మద్యం కొనుక్కున్నారు. హన్మకొండ బస్టాండ్ సమీపంలోని నిర్మాణం మద్యలో ఆగిపోయిన ఓ భవనం లో మద్యం సేవించారు. మ‌ద్యం సేవిస్తూ.. మాటా మాట అనుకోవ‌డంతో , అనంతరం చిన్న గొడ‌వ‌కు దారి తీసింది. తీవ్ర ప‌ద‌జాలంతో ఒక‌రినొక‌రు తిట్టుకుంటూ .. తీవ్రంగా ఘ‌ర్ష‌ణ‌ పడ్డారు. అందులో ఇద్ద‌రు వ్య‌క్తులు మ‌ద్యం మ‌త్తులో మ‌రో వ్య‌క్తిని మూడ‌వ అంతస్తు నుంచి నెట్టివేయడంతో అత‌ను కింద పడి అక్కడికక్కడే మ‌ర‌ణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.