- ఉమ్మడి జిల్లాలో మూడు దశల్లో ఎన్నికలు
- రిజర్వేషన్ల ఫైనల్‌తో అభ్యర్థుల వేటలో పార్టీలు
భద్రాద్రికొత్తగూడెం/ ఖమ్మం టౌన్, వెలుగు : గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల కోడ్ మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఉమ్మడి జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గురువారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో పల్లె పోరుపై పొలిటికల్ పార్టీలు దృష్టి సారించాయి. రిజర్వేషన్ల ఫైనల్‌తో రాజకీయ పార్టీలు అభ్యర్థుల వేటకు శ్రీకారం చుట్టాయి.
ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో పార్టీలు రాజకీయ జోరు పెంచాయి. పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని రాజకీయ పార్టీలు గ్రామ, మండల స్థాయి నేతలతో సమాలోచనలు సాగిస్తున్నాయి. అత్యధిక స్థానాల్లో విజయమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, మాస్ లైన్ పార్టీల నేతలు రాజకీయ పావులు
కదుపుతున్నాయి.
మూడు దశల్లో : భద్రాద్రి జిల్లాలోని 22 మండలాల్లోని 471 గ్రామపంచాయతీలు, 4,168 పంచాయతీ వార్డులకు మూడు దశల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. మొదటి దశ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 27వ తేదీ నుంచి నామినేషన్లు తీసుకోనున్నారు. రెండో దశ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 30వ తేదీ నుంచి నామినేషన్లు, మూడు దశ ఎన్నికలకు సంబంధించి వచ్చే నెల మూడో తేదీ నుంచి నామినేషన్లను ఎన్నికల అధికారులు తీసుకోనున్నారు. పోలింగ్ జరిగిన రోజు కౌంటింగ్ చేస్తారు. ఉప సర్పంచ్‌ను ఎన్నుకోనున్నారు.
మొదటి దశ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 11వతేదీన, అదే రోజు కౌంటింగ్ జరుగనుంది. మొదటి దశలో అశ్వాపురం, భద్రాచలం, బూర్గంపహడ్, చర్ల, దుమ్ముగూడెం, కరకగూడెం, మణుగూరు,పినపాకలో... రెండో దశలో అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, చంద్రుగొండ, చుంచుపల్లి, దమ్మపేట, ములకలపల్లి, పాల్వంచ లో జరుగగా.. మూడో దశలో.. ఆళ్లపల్లి, గుండాల, జూలూరుపాడు లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, టేకులపల్లి, ఇల్లెందు మండలాల్లో జరుగనున్నాయి.
ఖమ్మంలో.,
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న 566 గ్రామ పంచాయతీ లకు 5168 వార్డులకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో కొనిజర్ల, రఘునాథ పాలెం, వైరా, బోనకల్, చింతకాని, మధిర , ఎర్రుపాలెం రెండవ విడతలో కామేపల్లి, ఖమ్మం రూరల్, కూసుమంచి, ముదిగొండ,నేలకొండపల్లి, తిరుమలయ పాలెంలో జరుగనుండగా.. మూడవ విడతలో.. ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి,సత్తుపల్లి,తల్లడ,వేంసూర్,సింగరేణి మండలాలకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షుల చుట్టూ ప్రదక్షణలు..
గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు ఎన్నికల్లో పార్టీల సింబల్స్ లేకుండా జరుగనున్నాయి. ఈ క్రమంలో పార్టీల మద్ధతు కోసం ఆశావాహులు ఎమ్మెల్యేలతో పాటు పార్టీల జిల్లా, మండల అధ్యక్షుల వద్దకు పరుగు పెడ్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల టైంలో మీ గెలుపు కోసం మేం కృషి చేశాం. ఇప్పుడు మాకు సహకరించండి, మా వాళ్లకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వండి అంటూ గ్రామ, మండల స్థాయి నేతలు ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుల వద్దకు వెళ్తున్నారు. పార్టీల సింబల్స్ లేకున్నప్పటికీ ఆయా పార్టీల మద్ధతునే గెలుపోటములు సాధ్యమవుతుందంటూ ఆశావహులు తమ పై స్థాయి నేతలతో మంతనాలు సాగించే పనిలో నిమగ్నమయ్యారు.
