
హైదరాబాద్, వెలుగు: రేషన్ లబ్ధిదారులు, రైతులకు ప్రయోజనం చేకూర్చేలా సివిల్ సప్లైస్ శాఖ చేపట్టిన ‘ఆన్‌లైన్ ప్రొక్యూర్‌మెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఓపీఎంఎస్), టీ–రేషన్ యాప్, టీ–వాలెట్ యాప్‌లకు స్కోచ్ అవార్డులు లభించాయి. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో స్కోచ్ సంస్థ అధిపతి పన్నీర్ కొచ్చర్ నుంచి సివిల్ సప్లైస్ జీఎం జి.నాగేందర్ రెడ్డి పురస్కారాలను అందుకున్నారు. తమ శాఖకు మూడు అవార్డులు రావడం పట్ల కమిషనర్ అకున్ సబర్వాల్ సంతోషం వ్యక్తం చేశారు.
రైతుల కోసం ఓపీఎంఎస్
ధాన్యం కొనుగోలు, కనీస మద్దతు ధర చెల్లింపులకు సంబంధించి రైతుల కోసం తెచ్చినదే ‘ఆన్‌లైన్ ప్రొక్యూర్‌మెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఓపీఎంఎస్) సాఫ్ట్‌వేర్’. దీని ద్వారా సీజన్ ప్రారంభం కాగానే ధాన్యం కొనుగోలు కేంద్రాల సమాచారాన్ని రైతులకు సెల్‌ఫోన్ ద్వారా అందిస్తున్నారు. ఈ విధానం ద్వారానే గతేడాది ఖరీఫ్, రబీలకు సంబంధించి మొత్తం రూ.13,675 కోట్లను నేరుగా రైతుల ఖాతాలో జమ చేశారు.
టీ-రేషన్
రేషన్ లావాదేవీలను సామాన్య ప్రజలు సైతం ప్రత్యక్షంగా తెలుసుకునేలా ‘టీ–-రేషన్’ మొబైల్ యాప్ ను రూపొందించింది. ప్రజలు సివిల్ సప్లైస్ లావాదేవీలను ఈ యాప్ ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు. అధికారులు ఎక్కడి నుంచైనా రోజువారీ కార్యక్రమాలను నిర్వహించుకునేలా 13 అప్లికేషన్స్‌తో ప్రభుత్వ సేవలను రూపొందించారు. సరుకుల సరఫరా నుంచి పంపిణీ వరకు అన్ని వివరాలు ఇందులో పొందుపరిచారు. ఈ మొబైల్‌యాప్ ద్వారా సమీపంలోని రేషన్ షాప్ లోకేషన్ గుర్తింపు, షాపుల్లో జరిగే లావాదేవీలను లైవ్‌గా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది.
టీ-వ్యాలెట్ ద్వారా డిజిటల్ సేవలు
టీ–వ్యాలెట్ ద్వారా రేషన్ షాపుల్లో డిజిటల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రేషన్ లావాదేలతో పాటు ఇంటి పన్ను, విద్యుత్ బిల్లులు, నగదు జమ, మొబైల్ రీచార్జ్, డీటీఎచ్, ఇంటర్నెట్ బిల్లుల చెల్లింపులు వంటి సేవలు పొందవచ్చు.