
మెదక్‌టౌన్, వెలుగు: అదనపు కట్నం కోసం వేధించడంతో ఆత్మహత్య చేసుకున్న మహిళ కేసులో ముగ్గురికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ జిల్లా జడ్జి లక్ష్మీశారద బుధవారం తీర్పు ఇచ్చారు. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని వివరాల ప్రకారం.. చిలప్‌చెడ్ మండలంలోని బర్దీపూర్‌కు చెందిన శ్రీబంటు రామకృష్ణయ్యకు నలుగురు కూతుళ్లు, ఒక కొడుకు. చిన్న కూతురు మీనాకు 2020 మార్చి 15న చిట్కుల్ గ్రామానికి చెందిన బోయిని ప్రశాంత్‌తో వివాహం చేశారు. పెళ్లి సమయంలో రూ. 2 లక్షల నగదుతో పాటు 10 తులాల బంగారం, బైక్, ఇతర సామాగ్రి కట్నంగా ఇచ్చారు. కొన్నాళ్లకు మీనాను భర్త ప్రశాంత్‌తో పాటు అత్త యాదమ్మ, మామ పెద్ద రాజయ్య, మరిది ప్రభు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె 2020 అక్టోబర్15న ఇంట్లో దూలానికి చున్నీతో ఉరివేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయింది.
మృతురాలి తండ్రి రామకృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. పరిశీలించిన జిల్లా జడ్జి లక్ష్మీశారద మీనా భర్త బోయిని ప్రశాంత్, మామ బోయిని పెద్ద రాజయ్య, అత్త యాదమ్మలకు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇస్తూ బుధవారం తీర్పు ఇచ్చారు. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఉన్న అప్పటి తూప్రాన్ డీఎస్పీ కిరణ్‌కుమార్, చిలప్‌చెడ్ ఎస్సై గౌస్, ఏఎస్సై సుధారాణి, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ విఠల్, కోర్టు కానిస్టేబుల్ రవీందర్‌గౌడ్‌ను ఎస్పీ అభినందించారు.