గుజరాత్ లోని ఒకే ఇంటిపేరుతో ముగ్గురు అభ్యర్థులు

గుజరాత్ లోని ఒకే ఇంటిపేరుతో ముగ్గురు అభ్యర్థులు
  • ఎన్నికల్లో గందరగోళానికి గురవుతున్న ప్రజలు 

న్యూఢిల్లీ​:  ఈ సారి గుజరాత్‌‌లోని భరూచ్ లోక్​సభ స్థానంలో ఆసక్తికర పోరు జరగనుంది. అక్కడ ప్రధాన పార్టీలైన బీజేపీ, ఆమ్​ ఆద్మీ పార్టీ(ఆప్), భారత్​ ఆదివాసీ పార్టీ(బీఏపీ) నుంచి ‘వసావా’ అనే ఒకే ఇంటి పేరు గల ముగ్గురు బలమైన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి సిట్టింగ్​ ఎంపీ మన్ సుఖ్ వసావా మళ్లీ పోటీ చేస్తున్నారు. ఆయన ఇప్పటి వరకు ఆరుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.

 అలాగే, ఆప్ నుంచి చైతర్ వసావా బరిలోకి దిగుతున్నారు. ఆయన ప్రస్తుతం భరూచ్​ పార్లమెంట్​ పరిధిలోని దేడియాపాడ ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరితో పాటు భారత్​ ఆదివాసీ పార్టీ నుంచి దిలీప్ వసావా పోటీ చేస్తున్నారు. దిలీప్​ వసావా.. సీనియర్ గిరిజన నాయకుడు, ఝగాడియా స్థానం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చోటూ వసావా చిన్న కొడుకు. 

దీంతో ఈ స్థానంలో పోటీ ‘వసావా వర్సెస్​ వసావావర్సెస్​ వసావా’గా మారింది. ఆరు లక్షలకుపైగా గిరిజన ఓటర్లు ఉన్న భరూచ్ స్థానంలో మూడో దశలో మే 7న పోలింగ్​జరగనుంది. ఈ స్థానంలో పార్టీల కంటే కుటుంబ, వారసత్వ రాజకీయాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. దశాబ్ద కాలంగా అక్కడి రాజకీయాలను వసావా వంశం శాసిస్తోంది. దీంతో ఈ సారి కూడా బీజేపీ, ఆప్, బీఏపీ తిరిగి అదే వంశానికి చెందిన అభ్యర్థులను నామినేట్​ చేయడంతో అక్కడ ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అయితే, ఈ వంశానికి చెందిన వారు ఎన్నికల బరిలో నిలవడం ఇదే మొదటిసారి కాదు. 

గతంలో కూడా వీరు పలు ఎలక్షన్స్​లో తలపడ్డారు. దీంతో  ప్రతిసారీ ఓటర్లు కొంత గందరగోళానికి గురవుతున్నారు. కాగా, 1989 నుంచి 2019 వరకు ఈ స్థానంలో జరిగిన ప్రతి లోక్‌‌సభ ఎన్నికలో, ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించింది. 1998 నుంచి బీజేపీకి చెందిన మన్‌‌సుఖ్ వసావా ఈ సీటును గెలుస్తూ వస్తున్నారు. అయితే, ఈ సారి చోటూ వసావా కొడుకు ఎంట్రీ ఇవ్వడంతో మన్ సుఖ్ కు కొంత ఇబ్బందిగా మారనుందని తెలుస్తోంది.