
హాస్పిటల్లో సెక్యూరిటీ గాలికి కనిపించని ప్రొటెక్షన్ చర్యలు
ఆదిలాబాద్ అర్బన్, వెలుగు: పేదల వైద్యానికి పెద్ద దిక్కుగా నిలవాల్సిన ఆదిలాబాద్‌లోని రిమ్స్ హాస్పిటల్లో రోగులకు భద్రత కరువైంది. గడిచిన మూడు నెలల్లో ట్రీట్మెంట్ కోసం వచ్చిన ముగ్గురు రోగులు హస్పిటల్ బిల్డింగ్‌పైనుంచి దూకి సూసైడ్ చేసుకోవడం రిమ్స్ సెక్యూరిటీ లోపాలను బట్టబయలు చేస్తోంది. వరుస ఘటనలు జరుగుతున్నా ఎలాంటి ప్రొటెక్షన్ చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. వరుసగా సూసైడ్ ఘటనలు జరుగుతుండడంతో హాస్పిటల్‌లోని సెక్యూరిటీ ఏం చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కరువైన సెక్యూరిటీ..
రిమ్స్‌లో మొత్తం మూడు ప్లోర్లు ఉండగా 30 వార్డులున్నాయి. ఈ హస్పిటల్‌లోని భద్రతను పర్యవేక్షించేందుకు 78 మంది సెక్యూరిటీ గార్డులను ఔట్ సోర్సింగ్ప్రాతిపాదికన నియమించారు. కానీ వీరిలో 35 నుంచి 40 మంది డ్యూటీలకు ఎగనామం పెడుతున్నారు. ఇందులో అత్యధికులు అధికార పార్టీ లీడర్ల అండదండలతో ఉద్యోగాలు పొందిన వారే ఉన్నారు. అలాంటి వారి పనితీరుపై ఫిర్యాదులు రావడంతో సెక్యూరిటీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బలరాం నాయక్ ప్రయత్నించారు. అయితే రాజకీయ అండ కలిగిన కొంతమంది సెక్యూరిటీ గార్డులు అధికార పార్టీ లీడర్ల ద్వారా డైరెక్టర్‌పై ఒత్తడి తెచ్చారు. హాస్పిటల్‌లోని డాక్టర్లు సైతం డైరెక్టర్‌కు వ్యతిరేకంగా వ్యవహరించడంతో ఆయన దీన్ని పట్టించుకోవడం వదిలేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సగం మంది సెక్యూరీటీ గార్డులు డ్యూటీకి రాకపోవడంతో పాటు వచ్చిన వారు కూడా మొక్కుబడిగా డ్యూటీ చేస్తున్నారు. దీంతో హాస్పిటల్ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
వరుస ఘటనలతో హైరానా..
రిమ్స్ హస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వచ్చే రోగులు హస్పిటల్ బిల్డింగ్‌పైకి ఎక్కి ఆత్యహత్యయత్నానికి పాల్పడుతుండడం ఇటీవల రొటీన్‌గా మారింది. గడిచిన మూడు నెలల్లో ముగ్గురు రోగులు బిల్డింగ్ పైనుంచి దూకారు. మేల్ జనరల్ వార్డులో ట్రీట్మెంట్ పొందుతున్న పట్టణంలోని టీచర్స్‌కాలనీకి చెందిన రామకృష్ణ(48) అనే ప్రైవేట్ టీచర్ రెండో అంతస్తు నుంచి దూకి గతేడాది సెప్టెంబర్‌లో
అక్కడికక్కడే మృతిచెందాడు. అనారోగ్యంతో రిమ్స్‌లో చేరిన ఆదిలాబాద్ రూరల్ మండలం భీంసరి గ్రామానికి చెందిన కుష్నపెల్లి గంగన్న(35) గతేడాది డిసెంబర్ 21న ఎమర్జెన్సీ బ్లాక్ వద్ద గల రెండో అంతస్తు పైనుంచి దూకి స్పాట్లోనే చనిపోయాడు. తాజాగా జైనూర్ మండలం రాంనాయక్ తండాకు చెందిన కాంబ్లే మాధవ్ అనే రోగి క్యాజువాల్టీ వద్ద థర్డ్ ప్లోర్ నుంచి దూకి ఆత్మహత్యయత్నం చేశాడు. ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. మూడు షిప్ట్‌లతో కలిపి 24 గంటల పాటు సెక్యూరిటీ గార్డులు హాస్పిటల్లో డ్యూటీ చేస్తున్నారు. నిరంతరం సెక్యూరిటీ ఉన్న టైంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సెక్యూరిటీ గార్డులు రూల్స్ ప్రకారం డ్యూటీలు చేయకపోవడం, విధుల్లో ఉన్న టైంలో నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుండటం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని రోగులు కుటుంబీకులు చెబుతున్నారు.
ప్రొటెక్షన్ చర్యలేవీ..
రోగులు హాస్పిటల్ భవనం నుంచి దూకి మరణిస్తున్నా హాస్పిటల్లో ప్రొటెక్షన్ చర్యలు కనిపించడం లేదు. ప్రాణాలను కాపాడుకునేందుకు వచ్చిన రోగులు పరలోకానికి వెళ్తున్నా కట్టడి చేసేందుకు ఆఫీసర్లు చర్యలు చేపట్టడం లేదు. రోగులు పైకి వెళ్లకుండా 3 నుంచి 4 ఫీట్ల వరకు గ్రిల్స్‌ను ఏర్పాటు చేస్తే భవనంపైకి ఎవరూ వెళ్లకుండా ఉంటుందని పలువురు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నాతాధికారులు స్పందించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.