
జీడిమెట్ల, వెలుగు: ఇండ్లల్లో చోరీలు చేస్తున్న ముగ్గురిని బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరారం కాలనీలోని సుందర్‌నగర్‌కు చెందిన దీరంగుల రవి అలియాస్ గజ (21), భరత్ (20), సంతోష్ నగర్ కు చెందిన తన్నీరు సూరి అలియాస్ సూర్య (19) ముగ్గురు ఫ్రెండ్స్ జల్సాలకు బానిసయ్యారు. డబ్బు కోసం ఇండ్లల్లో చోరీలు మొదలుపెట్టారు. బాచుపల్లి పరిధిలో ఇటీవల మూడు ఇండ్లల్లో దొంగతనాలు చేశారు.
కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు టీమ్స్‌గా ఏర్పడి నిందితుల కోసం గాలించారు. గురువారం సూరారంలో ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2 తులాల బంగారం, 35 తులాల వెండి, రూ. లక్షా 50 వేల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. రవిపై 23 ప్రాపర్టీ అఫెన్స్ కేసులు, భరత్ పై 15 కేసులు, సూరిపై 3 కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించామన్నారు.
ఓనర్ ఇంట్లో చోరీకి పాల్పడ్డ ఇద్దరు అరెస్ట్
గండిపేట: ఓనర్ ఇంట్లో చోరీకి పాల్పడ్డ ఇద్దరిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీపీ లక్ష్మినారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఫీల్‌గుడ్ హోమ్స్‌లో ఉంటున్న రాధాకృష్ణ పెట్రోల్ బంక్ నడుపుతున్నాడు. అలవర్తి రవి, కల్లపల్లి సుధాకర్ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడ వర్కర్లుగా పనిచేస్తున్నారు. ఈ నెల 13న రూ.11 లక్షలను రాధాకృష్ణ ఇంట్లోని అల్మారాలో దాచాడు. మరుసటి రోజు ఫ్యామిలీతో కలిసి సొంతూరికి వెళ్లాడు.
ఈ నెల 17న రాత్రి తిరిగి ఇంటికి రాగా.. అల్మారాలో దాచిన డబ్బు కనిపించలేదు. దీంతో నార్సింగి పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం సాయంత్రం సంగారెడ్డిలో రవి, సుధాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.10 లక్షల 35 వేల క్యాష్ ను స్వాధీనం చేసుకున్నారు.