
దేశవ్యాప్తంగా చార్ ధామ్ యాత్ర కోసం తరలివెళ్లే భక్తుల కోసం కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన ఆరోగ్య సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది. యాత్రికుల ప్రయాణ సమయంలో వారికి మూడు అంచెల వైద్య సౌకర్యాలను అందుబాటులోకి ఉంచనుంది. ఈ మేరకు ఉత్తరాఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ ధన్ సింగ్ రావత్ తెలిపారు. చార్ ధామ్ యాత్రకు వచ్చే భక్తులకు ఆరోగ్య సౌకర్యాలపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్ సుఖ్ మాండవీయతో ధన్ సింగ్ రావత్ సమావేశమయ్యారు. ప్రతి ఏడాది చార్ ధామ్ యాత్రకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారని..వారి ఆరోగ్య సంరక్షణ కోసం అత్యవసర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. కష్టతరమైన మార్గంలో యాత్రికులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సవాళ్లను, గుండె పోటు వంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితులను కేంద్ర ఆరోగ్య మంత్రికి తెలిపారు. ధన్ సింగ్ రావత్ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన మన్ సుఖ్ మాండవీయ..మూడెంచల ఆరోగ్య మౌళిక సదుపాయాలను కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.
మూడంచెల ఆరోగ్య సదుపాయాలు..
చార్ ధామ్ యాత్ర కోసం వచ్చే భక్తులు ఆనారోగ్యానికి గురైతే వారిని అత్యవసరంగా ఆసుపత్రికి తరలించేందుకు చార్ ధామ్ హైవేపై అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచనుంది. అలాగే యాత్ర సమయంలో భక్తుల ఆరోగ్య సంరక్షణ కోసం మెడికల్ పీజీ విద్యార్థుల నియమించనుంది. ఎయిమ్స్ రిషికేశ్, డూన్, శ్రీనగర్ వైద్య కళాశాలల సహకారంతో యాత్రికుల కోసం డ్రోన్‌ల ద్వారా అత్యవసర ఔషధాలను అందించాలని నిర్ణయించింది.