మరో మూడు ఏకగ్రీవం!

V6 Velugu Posted on Nov 26, 2021

వరంగల్​ / మహబూబ్​నగర్ /నాగర్​కర్నూల్​, వెలుగు: లోకల్‌‌‌‌​ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో ముగ్గురు టీఆర్​ఎస్​ అభ్యర్థులు ఏకగ్రీవం కానున్నారు. వరంగల్​ నుంచి సిట్టింగ్​ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్​రెడ్డి​, మహబూబ్​నగర్​ నుంచి సిట్టింగ్​ ఎమ్మెల్సీలు కూచుకుళ్ల దామోదర్​రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డికి రెండో సారి అవకాశం దక్కనుంది. వీరి ఎన్నికను శుక్రవారం అధికారికంగా ప్రకటించనున్నారు.  కొందరు ఇండిపెండెంట్లు తమ నామినేషన్లను తిరస్కరించడంపై ఆందోళనలకు దిగారు. అధికారులు అడిగినట్లే పత్రాలు సమర్పించినా.. రిజక్ట్​ చేయడం ఏమిటని మండిపడ్డారు.  వరంగల్​ సీటులో స్కూటిని అనంతరం మొత్తం నలుగురు క్యాండిడేట్లు బరిలో నిలవగా.. విత్‍డ్రాల మొదటి రోజైన గురువారం ముగ్గురు ఇండిపెండెంట్లు నామినేషన్లు వాపస్‍ తీసుకున్నారు. దీంతో ఇక్కడ సిట్టింగ్​ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‍రెడ్డి ఏకగ్రీవం కానున్నారు. ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ సీట్లకు స్ర్కూటిని తర్వాత నలుగురు పోటీలో నిలవగా.. ఇందులో ఇద్దరు ఇండిపెండెంట్లు గురువారం నామినేషన్లు విత్​డ్రా చేసుకున్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్సీలు కూచుకుళ్ల దామోదర్​రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి ఏకగ్రీవం కానున్నారు.

ఏకగ్రీవాలకు ముందు నుంచే ప్లాన్​
ఎమ్మెల్సీ స్థానాలను ఏకగ్రీవం చేసుకోవడానికి ముందు నుంచే టీఆర్​ఎస్​ ప్లాన్​ వేసింది. పార్టీ క్యాండిడేట్లను ఫైనల్​ చేసినప్పటి నుంచి ఇతరులు ఎవరూ పోటీలో లేకుండా జిల్లా స్థాయి నాయకులు చక్రం తిప్పారు. మహబూబ్​నగర్​లోని రెండు సీట్లకు మొత్తం పది మంది నామినేషన్లు వేయగా.. ఆరుగురు ఇండిపెండెంట్ల నామినేషన్లను వివిధ కారణాలతో స్ర్కూటినిలో ఆఫీసర్లు తొలగించారు. మిగిలిన ఇద్దరు ఇండిపెండెంట్లను కూడా పోటీ నుంచి తప్పించేందుకు బుధవారం మధ్యాహ్నం నుంచే టీఆర్​ఎస్​ లీడర్లు చర్చలు జరిపినట్లు తెలిసింది. ఇందు కోసం భారీ మొత్తంలో ఆఫర్​ ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. చివరికి ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా నామినేషన్లు వెనక్కి తీసుకోవడంతో టీఆర్​ఎస్​ అభ్యర్థులు ఏకగ్రీవం కానున్నారు. దామోదర్​రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డిని గురువారం మంత్రి కేటీఆర్​ హైదరాబాద్​లో అభినందించారు.

నామినేషన్ల తిరస్కరణపై ఇండిపెండెంట్ల ఆగ్రహం
తమ నామినేషన్లను తిరస్కరించడంపై ఇండిపెండెంట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, టీఆర్​ఎస్​ లీడర్లపై వారు అనుమానాలు వ్యక్తం చేశారు. తన నామినేషన్​ రిజెక్ట్​ చేయడంపై అనుమానాలు ఉన్నాయని, కోర్టును ఆశ్రయిస్తానని గద్వాల జిల్లా గట్టు ఎంపీటీసీ ఎస్​.కృష్ణ చెప్పారు. సింగిల్​ సెల్ఫ్​ అఫిడవిట్  ఇచ్చారన్న కారణంతో రిటర్నింగ్​ అధికారి ఆయన నామినేషన్​ను రిజెక్ట్​ చేశారు. దీంతో కృష్ణ గురువారం ఎన్నికల కమిషన్​లో ఫిర్యాదు చేశారు. తనకు ఫోన్లు చేసి హెచ్చరించారని, దేనికీ భయపడేది లేదని ఆయన అన్నారు.  స్ర్కూటిని టైంలో నామినేషన్​ సెట్స్​ చెక్​ చేసుకోవడానికి రెండు గంటల టైం ఇస్తామని చెప్పిన అధికారులు మాట మార్చి ఏకపక్షంగా తన నామినేషన్​ రిజెక్ట్​ చేశారని జడ్చర్ల కౌన్సిలర్​షేక్​ రహీం బాషా ఆరోపించారు. టీఆర్​ఎస్​ నాయకులు ఇండిపెండెంట్లను నామినేషన్లు విత్​డ్రా చేసుకునేలా భయపెట్టారని కాంగ్రెస్ ​రాష్ట్ర కార్యదర్శి జనుంపల్లి అనిరుధ్​రెడ్డి ఆరోపించారు. మహబూబ్​నగర్​లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..  స్ర్కూటినిలో ఆరుగురు ఇండిపెండెంట్ల నామినేషన్లు ఎందుకు రిజెక్ట్​ చేశారని ఆర్వోను ప్రశ్నించారు. టీఆర్​ఎస్​ లీడర్ల ఒత్తిడి వల్ల వాటిని తిరస్కరించారని ఆరోపించారు.

Tagged TRS MLC Candidates, Telangana MLC Elections, ts mlc, mlc election anonymously

Latest Videos

Subscribe Now

More News