సింగరేణి ప్రమాదంలో గల్లంతైన ముగ్గురు మృతి

సింగరేణి ప్రమాదంలో గల్లంతైన ముగ్గురు మృతి

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా 3 డివిజన్‌‌‌‌లోని అడ్రియాల లాంగ్‌‌‌‌ వాల్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌లో సోమవారం మైన్​పైకప్పు కూలిన ప్రమాదంలో ఏడుగురు కార్మికులు గల్లంతైన విషయం తెలిసిందే. వారిలో వెంకటేష్, నరేష్, వీరయ్యలను అదే రోజు కాపాడగా..  రవీందర్ అనే కార్మికుడిని 26 గంటల తర్వాత రెస్క్యూ  టీమ్ కాపాడింది. కాగా.. మిగతా ముగ్గురు అసిస్టెంట్‌‌‌‌ మేనేజర్‌‌‌‌ తేజావత్‌‌‌‌ చైతన్య తేజ,  కాంట్రాక్టు కార్మికుడు తోట శ్రీకాంత్‌‌‌‌, సేఫ్టీ ఆఫీసర్‌‌‌‌ జయరాజ్‌‎ల ప్రాణాలు కాపాడలేకపోయారు. మంగళవారం రాత్రి రెస్క్యూ ఆపరేషన్ లో ఈ ముగ్గురి మృతదేహాలు బయటపడ్డాయి. ఘటనాస్థలం నుంచి మృతదేహాలను అర్ధరాత్రి దాటిన తర్వాత గోదావరిఖని సింగరేణి హాస్పిటల్‎కు తరలించారు. అక్కడ డెడ్‎బాడీలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆఫీసర్ జయరాజు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో ఆయన స్వస్థలమైన విజయవాడకు తరలించారు. అసిస్టెంట్ మేనేజర్ చైతన్య తేజ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి స్వస్థలం పాల్వంచకు తరలించారు. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో వెంకటేష్, నరేష్, రవీందర్, వీరయ్య అనే కార్మికులు ప్రాణాలు దక్కించుకోగా.. మిగతా ముగ్గురు చనిపోయారు.