రద్దీ మార్కెట్లే వీరి టార్గెట్.. మైనర్లతో ఫోన్లు కొట్టేయిస్తారు.. వెంటనే చేతులు మార్చుకుంటారు

రద్దీ మార్కెట్లే వీరి టార్గెట్.. మైనర్లతో ఫోన్లు కొట్టేయిస్తారు.. వెంటనే చేతులు మార్చుకుంటారు

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లాలో అత్యంత రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్‎లలో సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను సీసీ‌‌ఎస్ పోలీసులు పట్టుకున్నారు. వికారాబాద్, బొంరాస్​పేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇటీవల జరిగిన చోరీ కేసులపై ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు సీసీఎస్ ఇన్​స్పెక్టర్ బల్వంత్ రాయ్, టౌన్ ఇన్​స్పెక్టర్ రఘు కుమార్‌‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. సీసీటీవీ ఫుటేజ్, టెక్నికల్ ఆధారాలతో నిందితుల కదలికలను గుర్తించారు. 

కర్నూలు జిల్లాకు చెందిన కె.రవి అలియాస్ గౌరిని అదుపులోకి తీసుకోగా, మరో ఐదుగురు సభ్యులు, ముగ్గురు మైనర్లతో కలిసి దొంగతనాలు చేస్తున్నట్లు విచారణలో అంగీకరించాడు. వీరు ఆటోలు, బైక్​లపై రద్దీ మార్కెట్లలో తిరుగుతూ మైనర్లతో ఫోన్​లు చోరీ చేయించేవారు. ఆధారాలు దొరక్కుండా ఫోన్​లను వెంటవెంటనే ముఠా సభ్యుల మధ్య మార్చుకునేవారు. 

పక్కా సమాచారంతో వికారాబాద్​లో  నిందితులు అద్దెకు తీసుకున్న నివాస ప్రాంతంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. మొత్తం రూ. 3.75 లక్షల విలువైన 25 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు రవితోపాటు బి.మహేశ్, ఆకుల కార్తీక్, వడ్డె మురళీ, వడ్డె వెంకటేశ్, సంపంగి తిరుపతిని అరెస్ట్ చేశారు. ముగ్గురు మైనర్లను జువైనల్ హోమ్​కు తరలించారు.