వచ్చే నెలలో బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ ప్రారంభం : తుమ్మల నాగేశ్వరరావు

వచ్చే నెలలో బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ ప్రారంభం : తుమ్మల నాగేశ్వరరావు
  • పదిహేనేళ్లకు మోక్షం
  • మరిన్ని కంపెనీలను రప్పించేందుకు తుమ్మల ప్లాన్​ 
  • 2008లో వైఎస్, 2016లో కేటీఆర్ శంకుస్థాపన

ఖమ్మం/ సత్తుపల్లి, వెలుగు: సత్తుపల్లి నియోజకవర్గంలోని బుగ్గపాడులో ఏర్పాటుచేసిన మెగా ఫుడ్​ పార్క్​ కు ఇన్నేళ్లకు మోక్షం కలగబోతోంది. శంకుస్థాపన చేసిన పదిహేనేళ్ల తర్వాత వచ్చే నెలలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినిఆహ్వానించేందుకు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్లాన్​ చేస్తున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు సమీప జిల్లాల్లోని పండ్ల తోటల రైతులకు ఉపయోగపడేలా మరిన్ని ఫుడ్​ ప్రాసెసింగ్ యూనిట్లను, కొత్తగా కంపెనీలను ఏర్పాటు చేయించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రాంతంలో పండే అన్ని పంటలను స్టోరేజ్​ చేసేందుకు ఫుడ్​ పార్క్​ లో గోడౌన్​ లను నిర్మించారు. ఇప్పటికే జీడిపప్పు, మామిడి ప్రాసెసింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారు.

మంత్రి తుమ్మల నజర్​..!

203 ఎకరాల్లో ఏర్పాటుచేసిన మెగా ఫుడ్​ పార్క్​ లో పరిశ్రమల స్థాపనకు మరిన్ని కంపెనీలను రప్పించేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్లాన్​ చేస్తున్నారు. 2016లో తుమ్మల మంత్రిగా ఉన్న సమయంలో అప్పటి మున్సిపల్​ శాఖ మంత్రి కేటీఆర్ ను రప్పించి, రూ.109.44 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయించారు. అందులో 60 ఎకరాల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. కోల్డ్ స్టోరేజీలు, వేర్ హౌస్ లు, ప్యాకింగ్ గోడౌన్లు, సబ్ స్టేషన్, ప్రహారీ, సెంట్రల్ లైటింగ్, డివైడర్లు, డ్రైనేజీలు నిర్మించారు. ఏళ్లు గడుస్తున్నా, అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నా ఇన్నేండ్ల నుంచి మెగా ఫుడ్ పార్క్ లో ఒక పరిశ్రమ కూడా ఏర్పాటుకాలేదు.

పదుల సంఖ్యలో ఇండస్ట్రీలు ఏర్పాటైతే, వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశించిన స్థానికులకు ఇన్నాళ్లుగా నిరాశే ఎదురైంది. ప్రస్తుతం ఫుడ్​ పార్క్​ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తుండడంతో సంతోషం వ్యక్తమవుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వివిధ రకాల పండ్ల తోటలు సాగు అవుతుండడంతో రైతులకు ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో 2008లో రూ.70 కోట్ల అంచనా వ్యయంతో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ మెగా ఫుడ్ పార్క్ కు భూమి పూజ చేశారు.

ఆ తర్వాత పనులు ముందుకు పోలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తుమ్మల చొరవతోనే అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ఫుడ్​ పార్క్​ లో భూమి లీజు రేట్లు ఎక్కువగా ఉండడంతో ఆయనే కేటీఆర్​ తో మాట్లాడి, రేట్లు తగ్గించే ప్రయత్నం చేశారు. మళ్లీ ఇప్పుడు తుమ్మల హయాంలోనే ఫుడ్​ పార్క్​ ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఫ్యాక్టరీలొస్తేనే రైతులకు మేలు..!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మామిడి, జామ, అరటి, బొప్పాయి, పుచ్చకాయ, యాపిల్ బేర్​, డ్రాగన్​ ఫ్రూట్​, జీడి మామిడి, కోకో, వక్క, కొబ్బరి, పామాయిల్​ సహా చాలా రకాల తోటలను రైతులు సాగు చేస్తున్నారు. వీటితో పాటు పలు రకాల కూరగాయలు, ఆకు కూరలను కూడా సాగు చేస్తారు. ఫుడ్ పార్క్ లో ప్రాసెసింగ్ యూనిట్లు వస్తే రైతులకు అదనపు ప్రయోజనం కలుగుతుంది.

పంటలకు గిట్టుబాటు రేట్లు లేని సమయంలో గోడౌన్లలో వాటిని నిల్వ చేసుకుని, మంచి రేటు పలికిన సమయంలో ఆ పంటను అమ్ముకునేందుకు అవకాశం లభిస్తుంది. ఇక ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటయితే రైతుల నుంచి కంపెనీలు నేరుగా ఆయా రకాల పంటను కొనుగోలు చేసి, ప్రాసెస్​ చేయడం ద్వారా కంపెనీలతో పాటు రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

ఒకట్రెండు నెలల్లో రెండు కంపెనీలు ఏర్పాటవుతాయి 

బుగ్గపాడు మెగా ఫుడ్ పార్కులో ఫ్యాక్టరీల ఏర్పాటుకు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ట్రాన్సెండ్​ కాజూ ప్రాసెసింగ్ కంపెనీ, యెల్లో అండ్​ గ్రీన్​ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మ్యాంగ్ ప్రాసెసింగ్​ యూనిట్​ ఏర్పాటుచేసేందుకు అగ్రిమెంట్లు కంప్లీట్ అయ్యాయి. ఒకట్రెండు నెలల్లో వాటి గ్రౌండింగ్ పూర్తవుతుంది. వాటి ద్వారా 100 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుంది. కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌస్ నిర్వహణ కోసం ఇంకొందరు వ్యాపారులు ఇంట్రస్ట్ చూపించారు. మరిన్ని అనుబంధ యూనిట్లు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.


‌‌‌‌‌‌‌పవన్ కుమార్, జోనల్ మేనేజర్, టీఎస్ఐఐసీ