కాంగ్రెస్​ ప్రభుత్వంలో మంత్రిగా తుమ్మల

కాంగ్రెస్​ ప్రభుత్వంలో మంత్రిగా తుమ్మల

ఖమ్మం జిల్లా సత్తా చాటే నాయకుల్లో తుమ్మల నాగేశ్వరరావు ఒకరు.  ఆయన ఇవాళ ( డిసెంబర్​ 7)న తెలంగాణలో  ఏర్పడిన కాంగ్రెస్​ మంత్రి వర్గంలో మంత్రిగా ప్రమాణం పనిచేశారు.  ఆయన తెలుగుదేశం.. టీఆర్ఎస్​ ప్రభుత్వంలో కూడా మంత్రిగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది. 

తుమ్మల ప్రస్థానం ఇలా....


1982 సెప్టెంబరులో చర్ల మండలం ఏటుపాక గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సమక్షంలో తుమ్మల తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఆయనకు రాజకీయ జన్మనిచ్చింది సత్తుపల్లి నియోజకవర్గం. పూర్వ సత్తుపల్లి నియోజకవర్గంలోని దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలో 1953 నవంబర్ 15వ తేదీన జన్మించిన ఆయన తన రాజకీయాలను అక్కడి నుంచే ప్రారంభించారు.

తెలుగుదేశం స్థాపించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనే ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన ఓటమి చవిచూశారు. మళ్లీ ఏడాదిన్నరకే 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పుడే ఆయనకు ఎన్టీఆర్ కేబినెట్ ర్యాంకు ఇచ్చారు. తుమ్మల 1985,1994,1999,2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి 2016లో టీఆర్ఎస్ పార్టీ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2015లో శాసన మండలికి ఎన్నికయ్యారు. 2004 ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు.

2009 ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. తరువాత తెలంగాణలో జరిగిన రాజకీయ పరిణామాల్లో 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. అనంతరం ఆయనకు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. కేసీఆర్ మంత్రివర్గంలో ఆయన ఆర్‌అండ్‌బీ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహించారు. 2016లో పాలేరు ఉప ఎన్నికలో పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి రాంరెడ్డి సుచరితపై 45,684 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

కాంగ్రెస్ లో ప్రస్థానం..

తుమ్మల నాగేశ్వరరావు 2023 సెప్టెంబర్ 14న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజీనామా లేఖను పంపించారు. హైదరాబాద్ వేదికగా హైదరాబాద్‌లోని తాజ్‌ కృష్ణాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనను 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రకటించిన రెండో జాబితాలో ఖమ్మం అభ్యర్థిగా ప్రకటించింది. ఖమ్మం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణం  చేశారు.